నవతెలంగాణ – న్యూఢిల్లీ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి బుధవారం వెల్లడించారు. అయితే ప్రత్యేక ధర్మాసనం నుండి తాను వైదొలుగుతున్నట్లు సిజెఐ ప్రకటించారు. ” దర్యాప్తు కమిటీలో ఉన్నందున విచారణ నేను చేపట్టడం సరికాదని బావిస్తున్నాను. ఈ పిటిషన్‌పై విచారణకు మరో బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సి వుంటుంది” అని సిజెఐ పేర్కొన్నారు.
మాజీ సిజెఐ సంజీవ్ ఖన్నా సూచించిన సిఫారసుకు సంబంధించి పిటిషన్ పలు రాజ్యాంగ సమస్యలను లేవనెత్తిందని జస్టిస్ వర్మ తరపున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. పార్లమెంట్‌లో జస్టిస్ వర్మ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత, తొలగింపు అంశాన్ని న్యాయపరంగా పరిశీలించేందుకు సిజెఐ సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. అంతర్గత విచారణ ప్రక్రియ అనేది పార్లమెంట్ ప్రత్యేక అధికారాన్ని న్యాయవ్యవస్థ బలవంతంగా లాక్కునేందుకు రూపొందించిన ‘సమాంతర, రాజ్యాంగేతర యంత్రాంగం’ అని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మార్చి 14-15 తేదీల్లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత జస్టిస్ వర్మ అధికారిక నివాస ప్రాంగణంలో దగ్ధమైన స్టోర్ రూమ్‌లో గుట్టలుగా నగదు లభ్యమైందని ముగ్గురు జడ్జీలతో కూడిన అంతర్గత విచారణ కమిటీ నిర్థారించింది. జస్టిస్ వర్మ రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో మే నెలలో మాజీ సిజెఐ సంజీవ్ ఖన్నా ఈ నివేదికను ప్రధాని మరియు రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే.