Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టాలు కావాలి

వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టాలు కావాలి

- Advertisement -

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌
9వ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-కల్చరల్‌

దేశవ్యాప్తంగా వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ 9వ వార్షికోత్సవ వేడుకల సభ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. చంద్ర కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ మసన చెన్నప్పతో కలిసి గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సహజ కార్యకలాపాలు ఎంతో విలువైనవని, వారికి జ్ఞానం, క్రమశిక్షణతోపాటు అపారమైన జీవిత అనుభవం ఉంటుందని తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు ఎప్పుడూ భారం కాదని, వారి అనుభవం నేటి యువతకు ప్రత్యేకమైన పాఠమని చెప్పారు. వృద్ధాప్యంలో పిల్లలే తల్లిదండ్రులను పోషించాలని 2007లో ప్రత్యేక చట్టాన్ని రూపొందించారని తెలిపారు. నేడు పిల్లలు, వారి తల్లిదండ్రులను చూసుకోలేక వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సంఘం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. వైద్యంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల వృద్ధులు 80 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నారని అన్నారు. వృద్ధులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వయోవృద్ధులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రొ.మసన చెన్నప్ప మాట్లాడుతూ.. వృద్ధుల కోసం సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వృద్ధులకు సేవా రత్న అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, పీఎస్‌ఎన్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -