Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైతాంగం, విద్యావ్యవస్థపై ప్రత్యేక చట్టాలు తేవాలి

రైతాంగం, విద్యావ్యవస్థపై ప్రత్యేక చట్టాలు తేవాలి

- Advertisement -

బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రులు స్పందించాలి
ట్రంప్‌ జోక్యంపై మోడీ పార్లమెంట్‌లో చెప్పాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- అచ్చంపేట

రైతాంగం, విద్యావ్యవస్థపై పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు స్పందించాలన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో గురువారం మీడియా సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్‌ జోక్యం ఉందా లేదా? అనేది పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెప్పాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించినప్పుడు తెలంగాణలో ఎందుకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సీపీఐ(ఎం)గా స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు అనేక హామీలిచ్చారని.. అవి అమలుకు నోచుకోలేదని అన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లల్లో విద్యార్థులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో గ్రామస్థాయిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడా పోరాటాలు చేస్తామని వెల్లడించారు.
రైతుల సబ్సిడీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌
వ్యవసాయ రంగంలో రైతులకు అందించే సబ్సిడీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌ అన్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశం నుంచి మన దేశానికి పాలు దిగుమతి చేసుకోవాలంటే లీటరు రూ.30కే ఇస్తామని చెబుతుందంటే.. అక్కడ రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సబ్సిడీలు ఇవ్వడం వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. కానీ, మన దేశంలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగానికి పూర్తిస్థాయిలో సబ్సిడీలు అందించి ఆదుకోవాలని కోరారు. యూరియా కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. 9 వేల టన్నులు మాత్రమే సప్లై చేసి కొరత సృష్టిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఆర్‌.వెంకట్‌రాములు, ఎం.ధర్మానాయక్‌, జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు దేశ్యానాయక్‌, జిల్లా కమిటీ సభ్యులు శంకర్‌నాయక్‌, నాగరాజు, మండల కార్యదర్శి సైదులు, సయ్యద్‌, సైదులు, నిర్మలరాములు, శివకుమార్‌, బక్కయ్య వెంకటయ్య, ఆంజనేయ రవి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -