Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణను వేగవంతం చేయండి

నీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణను వేగవంతం చేయండి

- Advertisement -

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలి :
– అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
: రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు నిర్వాసితుల పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో నీటిపారుదల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టపరమైన, పాలనాపరమైన అంశాలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల పురోగతిలో ఎదురౌతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికార యంత్రాంగం పని చేయాలన్నారు. భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో సర్కారుపై వ్యయభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు సానుకూలంగా చర్చలు జరపాలన్నారు. నష్టపరిహారం, పునరావాసం వంటి అంశాలపై బాధితులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ విషయంలో ఆలస్యం చేస్తే ప్రభుత్వం ప్రజావ్యతిరేకతతోపాటు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొవాల్సి వస్తోందని అధికారులను హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై ఆయా ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరపాలన్నారు. అదే సమయంలో పాలనాపరమైన అంశాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. టన్నెల్‌ నిర్మాణాల్లో అవసరమైన ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు భారత సైన్యంలో పని చేసిన ప్రముఖ ఇంజినీరింగ్‌ నిపుణులైన హార్బల్‌ సింగ్‌, కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రాల సేవలను ఉపయోగించుకోబోతున్నట్టు తెలిపారు. ఆ ఇద్దరు అత్యంత క్లిష్టమైన రోహ్హంగ్‌, జోజిలా టన్నెల్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాజేంద్రనగర్‌లోని వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను మరింత బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -