దేశవాళీ ఆటగాళ్లకూ తప్పని తిప్పలు
కొలంబో : శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ ప్రమాణాలు ఆ దేశ క్రికెటర్లను ఇరకాటంలో పడేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గాయపడిన మతీశ పతిరణ, వానిందు హసరంగతో పాటు మరో 15 మంది క్రికెటర్లు ఇప్పటివరకు ఫిట్‌నెస్ టెస్టుకు హాజరు కాలేదు. సెంట్రల్ కాంట్రాక్టు కలిగిన ఆటగాళ్లలో 15 మంది పరీక్షకు హాజరు కాలేదని బోర్డు తాజాగా వెల్లడించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు 45 మంది క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వగా అందులో 24 మంది మాత్రమే ఇప్పటివరకు ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గారు. ఐపీఎల్‌లో వానిందు హసరంగ లక్నో సూపర్‌జెయింట్స్‌కు, మతిశ పతిరణ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. తొడ కండరాల గాయానికి గురైన హసరంగ ఇంకా కోలుకోలేదు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. మతిశ పతిరణ పిక్క కండరాల నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సాధన షురూ చేశాడు. ఏప్రిల్ రెండో వారంలో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యే సూచనలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన అనంతరం ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షను తప్పనిసరి చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫిట్‌నెస్ ప్రమాణాలను దేశవాళీ క్రికెట్‌లోనూ అమలు చేస్తున్నారు. నేషనల్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్లు తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గాలని నిబంధన తీసుకొచ్చారు.
ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన ఆటగాళ్లకు టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉంటుంది కానీ, మ్యాచ్ ఫీజును చెల్లించరు. ఈ నిబంధనపై క్రికెటర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఫిట్‌నెస్ టెస్టులో పాస్ కాలేదని ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్వోసీ నిరాకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుపై నువాన్ తుషార ఇప్పటికే కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
శ్రీలంక క్రికెటర్ల ఫిట్‌నెస్ కష్టాలు
- Advertisement -
- Advertisement -



