నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది.
రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.