నేడు ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
అసెంబ్లీలో భట్టి, మండలిలో ఉత్తమ్
సంక్షేమ పథకాలకు పెద్దపీట
వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత
రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ అభివృద్ధికి అత్యధిక నిధులు
ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకు భారీగా కేటాయింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఉభయసభల్లో పెట్టనుంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోయే మూడో బడ్జెట్ ఇది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది?, కొత్త పథకాలను ఏమైనా ప్రకటిస్తుందా?, బడ్జెట్ ఎంత ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూ.3,04,965 కోట్లు ప్రవేశపెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరమున్నది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2026-27 వార్షిక బడ్జెట్ రూ.3.20 లక్షల కోట్లు ప్రతిపాదించే అవకాశమున్నట్టు తెలిసింది.
ఆరు గ్యారంటీల అమలుపై కేంద్రీకరణ
ఆరు గ్యారంటీల గురించి విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆరు గ్యారంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. సంక్షేమ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశమున్నది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. అమలు కాని హామీల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వాటి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రీకరించినట్టు సమాచారం. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో చదువుకునే అమ్మాయిలకు ఈ-స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే వార్షిక బడ్జెట్‌లో వాటికి సంబంధించిన నిధులను కేటాయించే అవకాశమున్నది.
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులను ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేయలేదు. రాబోయే బడ్జెట్‌లో దీనిపై ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి. మరోవైపు పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అదీ అమలుకు నోచుకోలేదు. దీని అమలు కోసం మహిళలంతా ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది ఎలా నెరవేరుతుందో వేచిచూడాలి. ఆసరా పెన్షన్లు రూ.నాలుగు వేలకు, వికలాంగుల పెన్షన్ రూ.ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అది అమలు కాలేదు.
కళ్యాణలక్ష్మి కింద రూ.1,01,116 తోపాటు తులం బంగారు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రైతులు, కౌలురైతులకు ఎకరాకు రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చింది. రైతు భరోసా ఏటా రూ.12 వేలు ఇస్తున్నది. తులం బంగారు, రైతు భరోసా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు, ఆటోడ్రైవర్లఎకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలుకు నోచుకోలేదు. వీటికోసం ఆయా వర్గాల ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఏమైనా తీపికబురు ఉంటుందేమో చూడాలి.
అంతా ఫ్యూచర్ సిటీ…
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీపైనే కేంద్రీకరించి పనిచేస్తున్నది. దాని అభివృద్ధికి అధిక నిధులు కేటాయించే అవకాశమున్నది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నది. మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులతోపాటు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించనున్నట్టు తెలిసింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరించిన 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ పర్యావరణ కారిడార్‌ను పునరుజ్జీవింపజేయాలని నిర్ణయించింది. ఇంకోవైపు తెలంగాణ అభివృద్ధి కోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (ప్యూర్), రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమి (రేర్) ప్రణాళికలను రూపొందించింది.
ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అనుసంధానం, రైళ్ల విస్తరణ, కొత్త విమానాశ్రయాలను నెలకొల్పడం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలను పెంచడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశమున్నది. ఇంకోవైపు వచ్చే వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతోపాటు ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలని భావిస్తు న్నది.
రైతులకు రైతు భరోసా ఇవ్వడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, సన్న వడ్లకు బోనస్ క్వింటాలుకు రూ.500 ఇవ్వాలని నిర్ణయించింది. పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని చూస్తున్నది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగలేదు. త్వరలోనే ఆయా కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగే అవకాశమున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.
ఉద్యోగులకు వరాలుంటాయా?
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఉద్యోగులకు ఏమైనా వరాలు కురిపిస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తున్నది. అవి సరిపోక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 67,763 ఉద్యోగాలను భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించింది. అది అమలు కావడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి రూ.నాలుగు వేలు ఇస్తామని చెప్పింది. దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి.




