సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ గోపాల గౌడ కీలకోపన్యాసం..
కార్మిక హక్కులపై రాజీపడేది లేదు : స్పష్టం చేసిన మంత్రి శివన్‌కుట్టీ
తిరువనంతపురం : ప్రస్తుతమున్న 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈనెల 19న రాష్ట్ర స్థాయి సదస్సుకు కేరళ ఆతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి.శివన్‌కుట్టి సోమవారం తెలియచేశారు. లేబర్ కాన్‌క్లేవ్ 2025 పేరుతో జరగనున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజధాని తిరువనం తపురంలో ప్రారంభిస్తారు. ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ శివన్‌కుట్టి, లేబర్ కోడ్‌లను తీవ్రంగా విమర్శించారు. అవన్నీ కార్మిక వ్యతిరేకమైనవని, ఫెడరల్ వ్యవస్థను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. కొత్త చట్టాల్లోని అనేక నిబంధనలు కార్మికుల హక్కులను నీరుగారుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు రక్షణ కోసం, అదే సమయంలో రాష్ట్రాల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.పంజాబ్, తమిళనాడు, జార్ఖండ్, తెలంగాణాలతో పలు రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖా మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్పందించాలని కోరారు. కేరళ ఆర్థిక, న్యాయ శాఖ మంత్రి కె.ఎన్.బాలగోపాల్, పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు సాంకేతిక సెషన్లు వుంటాయి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, కార్మిక సంఘ నేతలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. అడ్వకేట్ జనరల్ కె.గోపాల్‌కృష్ణ కురూప్ అధ్యక్షతన జరిగే మొదటి సమావేశంలో లేబర్ కోడ్‌ల ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ కీలకోపన్యాసం చేస్తారు. రెండో సెషన్‌లో, కేరళ కార్మిక విధానాన్ని, లేబర్ కోడ్‌లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పథకాలను, వ్యూహాలను పరిశీలిస్తారు. రాష్ట్రాల వైఖరి, డిమాండ్లను పేర్కొంటూ విధానపరమైన డిక్లరేషన్‌ను ఆమోదించడంతో సదస్సు ముగుస్తుందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. లేబర్ కోడ్‌లను వ్యతిరేకించే కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసి విధాన డిక్లరేషన్‌లో లేవనెత్తిన డిమాండ్లు, నిర్ధారణల ప్రాతిపదికన ఒక మెమోరాండాన్ని అందచేసే అవకాశం వుందన్నారు. కార్మికుల ప్రయోజనాల విషయంలో కేరళ రాజీపడేది లేదని శివన్‌కుట్టీ పునరుద్ఘాటించారు. కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేస్తూనే కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా వుండే ఏ నిబంధననైనా తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు.
లేబర్ కోడ్‌లపై 19న కేరళలో రాష్ట్ర సదస్సు
- Advertisement -
- Advertisement -



