గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ సౌకర్యం : మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”స్వయం సహాయక బృందాల రూపంలో సగటు స్త్రీ అస్తిత్వం మరింత శక్తివంతమవుతోంది. ఎస్‌హెచ్‌జీల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, వారిని గ్లోబల్ మార్కెట్ వైపు తీసుకెళ్తున్నాం” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, సెర్ప్‌సీఈఓ దివ్య దేవరాజన్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఆర్‌డీఓ లు, అడిషనల్ డీఆర్‌డీఓలు, అన్ని మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు హాజరయ్యారు.
ఆడపిల్లలకు 21 ఏండ్లు నిండిన తర్వాతనే వివాహాలు జరపడం, ప్రతి ఆడపిల్లను చదివించడం, మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైెనా ఎదిరించడం, కుల, మత భేదాలను వదిలేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడంలో ముందుండడం వంటి అంశాలను మహిళలతో సీతక్క ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి వారిని ఆర్థికంగా బలంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ సంకల్పంపై కొంతమంది ఎద్దేవా చేసినా, ఇప్పటికే అనేక మండల సమాఖ్యల్లో కోట్ల రూపాయల నిధులు ఉండటం, గ్రామీణ మహిళలు వ్యాపారాలు నెలకొల్పడం ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ఇంట్లో ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్మే ఈ ప్రభుత్వ విధానాల వల్లే మహిళా శక్తి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంనుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు అందించే స్థాయిక ఎస్‌హెచ్‌జీల ఎదుగుదల చేరిందనీ, ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల యూనిఫాంలను కూడా మహిళా సంఘాల చేతుల మీదుగా సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులు ఎస్‌హెచ్‌జీలకు రుణాలు ఇవ్వడం, అందులో 99 శాతం రుణాలు తిరిగి చెల్లించడం మహిళల నిబద్ధతకు నిదర్శకమని తెలిపారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఇందిరా మహిళా శక్తి బజార్‌లు విస్తరించనున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారుచేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూలు విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయనీ, స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. గ్రామాల్లో, మండలాల్లో మహిళా సమాఖ్యలు ఒంటరి మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయనీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు మహిళా సంఘాలు ముందుగానే ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలతో మహిళల్లో ధైర్యం పెరుగుతుందనీ, స్వయం సహాయక సంఘాలే సాధారణ స్త్రీకి అస్తిత్వాన్ని ఇచ్చే వేదికలని చెప్పారు.
65 లక్షల మహిళా సభ్యులు పిడికిళ్లు బిగిస్తే చీకట్లన్నీ తొలగిపోతాయనీ, మహిళల శక్తితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు.ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న మహిళా శక్తి బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతామని, మహిళా సమాఖ్య సభ్యులకు ప్రత్యేక యూనిపాం చీరలు అందజేస్తామని ప్రకటించారు. సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ, ఇందిరా గాంధీలా మహిళలు ధైర్యంగా నిలబడితే కొత్త చరిత్ర లిఖించ వచ్చని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి వెలుగు మహిళలే అని, కష్టాలు వచ్చినా మహిళలు వెనక్కి తగ్గకూడదనీ, ప్రజా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని..మహిళా సంఘాలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం డీఆర్‌డీఓ, అడిషనల్ డీఆర్‌డీఓ లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. వాటి బలోపేతంపై కీలక సూచనలు చేశారు.



