నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండిస్టీస్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాద ఘటన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని సీఎస్…హైకోర్టుకు తెలిపారు. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున చెల్లించామని చెప్పారు. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన దారుణ పేలుడు ఘటనలో 46 మంది మరణించారనీ, 28 మంది గాయపడ్డారనీ, మరో 8 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని బాబురావు అనే రిటైర్డు సైంటిస్ట్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలను అమలు చేయకపోవడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందనీ, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని పిటిషనర్ తరపు అడ్వొకేట్ వసుధ నాగరాజ్ చెప్పారు. కౌంటర్‌పై వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ… మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ఉపాధి ప్రయోజనాల చట్టాల ప్రకారం బాధితులందరికీ పరిహారం చెల్లింపులు ఉన్నాయని వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం అందిస్తాం, సిగాచీ, కార్మిక శాఖ భాగస్వామ్యంతో ఆ మొత్తం చెల్లిస్తామంటూ సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఘటన జరగ్గానే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు కోర్టుకు తెలిపారు. భద్రతా లోపాలు, నియంత్రణ చర్యలు లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో సంసిద్ధత లేకపోవడమే ప్రమాదానికి కారణమని కమిటీ ప్రాథమికంగా తేల్చిందనీ, అయితే సమగ్ర నివేదిక రావాల్సి ఉందన్నారు. ప్రమాదం గురించి తెలియగానే హైడ్రా నుంచి 265, ఎన్డీఆర్‌ఎఫ్ 25, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపకశాఖ నుంచి 350, జిల్లా పోలీస్ నుంచి 200, టీజీఎస్పీ నుంచి 9 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని వివరించారు. 43 మంది మరణ ధ్రువీకరణ పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశామనీ, మరో మూడు మృతదేహాలకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆచూకీ తెలియని 8 మంది మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారని వివరించారు ఘటన జరిగిన వెంటనే సీఎం ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించారని తెలిపారు. కలెక్టర్, కార్మికశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పోలీసులు, పరిశ్రమల శాఖల నుంచి నివేదికలు తెప్పించినట్టు కౌంటర్‌లో వివరించారు.
నమిత హౌమ్స్ నిర్మాణంపై హైకోర్టు స్టే
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో నమిత్ హౌమ్స్ చేపట్టిన 25 అంతస్తుల 360 లైఫ్ బహుళ అంతస్తుల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. శ్రీముఖ్ నమిత హౌమ్స్‌కు గత అనుమతులను నిలిపివేసిన జీహెచ్‌ఎంసీ మరో నెల రోజులకే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అనుమతులు ఇవ్వడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. నమిత హౌమ్స్‌కు అనుమతులను పునరుద్ధరిస్తూ జూన్ 11న జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఆదేశాలను అందులో పార్టనర్ ఎర్రం విజరుకుమార్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఫైర్, ఎయిర్ పోర్టు అథారిటీ తదితరుల నుంచి ఎన్వోసీలు సమర్పించలేదని, ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు సెల్లార్‌లు నిర్మిస్తున్నారని, మేలో నోటీసు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ జూన్‌లో అనుమతులు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
గుడ్ల టెండరుకు గ్రీన్ సిగల్
అంగన్‌వాడీలు, ప్రభుత్వ బడులు, హాస్టల్స్‌లోని విద్యార్థులకు గుడ్ల సరఫరా టెండర్‌ను సవాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా విధించింది. సెప్టెంబరు ఒకటి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31వరకు ఎం.ఎ.ఫౌల్ట్రీ అండ్ ఫీడ్‌కు టెండరును ఖరారు చేయడాన్ని ఇబ్రహీంపట్నంకు చెందిన సిరిఫామ్స్ సవాల్ చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం తీర్పు చెప్పారు. పిటిషనర్ గుడ్డు ధర రూ.6.69 పైసలకు టెండరు వేయగా, ప్రతివాది కంపెనీ రూ.6.10 కే వేసిందని ప్రభుత్వం చెప్పింది. ఈ టెండరులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. టెండరును అడ్డుకోవడానికి పిటిషన్ వేసిన పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తూ, పిటిషన్‌ను కొట్టేసింది. న
సిగాచి బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES