నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పంచాయతీ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ,ఎస్ పి లు, పంచాయతీ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికలపై సమీక్షించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు, పిఓ,ఏపిఓ లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని రకాల కమిటీలను చైతన్యం చేయాలని, అవసరమైన బందోబస్తు ప్రణాళిక, సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాలన్నారు. నోడల్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఈనెల 27 నుండి స్వీకరించనున్న మొదటి విడత నామినేషన్ల సందర్భంగా ఆర్ ఓ ల తో తక్షణమే టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.


