Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంకార్మికుడిపై దెబ్బ

కార్మికుడిపై దెబ్బ

- Advertisement -

వేతనాలు తొమ్మిది శాతం తగ్గుదల
ప్రయివేటు రంగం లాభాలు నాలుగు శాతం పెరుగుదల
2020-24 మధ్య ఉత్పాదకత పెరిగినా..కార్మికుడికి చేకూరని లాభం
రూపాయి బలహీనత, దిగుమతుల పెరుగుదల, వేతనాల నిలకడ కారణాలు

న్యూఢిల్లీ : మోడీ పాలనలో కార్మికుల స్థితిగతులు కఠినంగా మారాయి. కనీస వేతనాలు లేకపోవడం, ఉన్న వేతనాల్లోనూ నిలకడ పరిస్థితులు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇక ద్రవ్యోబల్బణం వంటి పరిస్థితులు, ఇతర కారణాలు వారి వాస్తవ వేతనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో వారి వేతనాలు క్రమంగా పడిపోయేలా చేస్తున్నాయి. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రయివేటు రంగం లాభాలు మాత్రం పెరుగుతున్నాయి. భారత్‌లో 2020-24 మధ్య కాలంలో కార్మికుల నిజ వేతనాలు తొమ్మిది శాతం తగ్గిపోయాయి. ప్రయివేటు రంగం లాభాలు మాత్రం నాలుగింతలు పెరుగుదలను నమోదు చేశాయి. ఆర్థిక సర్వే గణాంకాలను బట్టి ఈ విషయం తెలుస్తున్నది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి దారుణంగా పడిపోతున్న ఈ తరుణంలో కార్మికుల వేతనాలు పడిపోవడం.. ప్రయివేటు కంపెనీలకు లాభం చేకూరటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదని నిపుణులు చెప్తున్నారు.

రూపాయి పతనంతో పాటు దిగుమతులపై అతిగా ఆధారపడటం, వేతనాల్లో స్తబ్దత వంటి పరిస్థితులు కార్మికుల నిజ వేతనాలు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా వారు వివరిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, కార్మికుల వ్యతిరేక చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారాయి. ప్రధానంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. భారత్‌లో దిగుమతులు ఎప్పుడూ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా పెట్రోల్‌, బంగారం, ఎలక్ట్రానిక్స్‌, మెషినరీ వంటి దిగుమతులను ఉదాహరణలుగా చెప్పొచ్చు. దీంతో వీటిని కొనడానికి భారత్‌ పెద్ద మొత్తంలో డాలర్లను వినియోగించాల్సి వస్తుంది. దీంతో డాలర్‌ ఖరీదు పెరగటం, రూపాయి బలహీనపడటం జరుగుతోంది.

తగ్గిన కొనుగోలు శక్తి
రూపాయి పతనం జరిగితే దిగుమతులు ఖరీదవుతాయి. ముఖ్యంగా భారత్‌ 87 శాతం పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి పెట్రోల్‌ ఖరీదైనప్పుడు అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. ఇది దిగుమతి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. దీనర్థం.. వస్తువుల ధరలు పెరగటం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం. దేశంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) పడిపోయినట్టు గణాంకాలు చెప్తున్నా యి. ఫుడ్‌ సీపీఐ తగ్గింది. మొత్తం ద్రవ్యోల్బణం కూడా 4.6 శాతానికి చేరింది. ఇది వినియోగ దారులకు కొంత ఊరటనిచ్చే అంశమే.

కానీ.. కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదు. దీంతో దేశంలోని ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎకానమీ సర్వే ప్రకారం 2017-2024 మధ్య మొత్తం కార్మికుల అసలు వేతనాలు 9.81 శాతం తగ్గాయి. ఇందులో స్వయం ఉపాధికి చెందినవారి వేతనాలు 20.65 శాతం, వేతన ఉద్యోగులవి 9.45 శాతం పడిపోయాయి. ఇటు సంఘటిత రంగంలోనూ నిరాశజనక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ వేతనాల వృద్ధి 0.8 శాతం నుంచి 5.4 శాతం మధ్య ఉన్నది. కానీ ద్రవ్యోబల్బణం 5.7 శాతంగా ఉండటంతో వాస్తవ వేతనాలు తగ్గినట్టేనని విశ్లేషకులు వివరిస్తున్నారు.

వేతనాలు పెరగాలి..దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి
రూపాయి బలహీనత భారత్‌లో కొనుగోలు శక్తిని నేరుగా దెబ్బ తీస్తోంది. ధరలు పెరుగుతున్నా.. వేతనాలు పెరగకపోవడంతో సగటు భారతీయ కుటుంబం నిజ ఆదాయం తగ్గిపోయింది. ప్రయివేటు కంపెనీలు లాభాలు సాధించినా.. ఆ లాభాల్లో కార్మికులకు వాటా దక్కలేదు. ఈ అంతరం తగ్గాలంటే వేతనాల పెరుగుదల, సామాజిక భద్రతా బోర్డుల బలోపేతం జరగాలనీ, దిగుమతులపై ఆధారపడటం తగ్గాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రయివేటు లాభాలు ఎలా పెరిగాయి?
దేశంలోని వేతన జీవుల వెతలు ఇలా ఉంటే.. ప్రయివేటు కంపెనీల లాభాలు మాత్రం పెరిగాయి. కోవిడ్‌, లాక్‌డౌన్‌, డిమాండ్‌ షాక్‌ల తర్వాత కెపిటల్‌-ఇంటెన్సివ్‌ కంపెనీల లాభాలు భారీగా పెరిగాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ కార్మికులకు ఇచ్చే వేతనాలు అదే స్థాయిలో పెరగలేదని అంటున్నారు. ప్రత్యేకించి 2020-24 మధ్య ప్రయివేటు లాభాలు నాలుగు రెట్లు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కార్మికుల అసలు వేతనాలు 9 శాతానికి పైగా తగ్గాయి. ఉత్పాదకత పెరిగినప్పటికీ.. ఆ లాభం కార్మికులకు చేరలేదని వివరిస్తున్నారు. రూపాయి బలహీనపడటం, డాలర్‌ ఖరీదవడం, దిగుమతులు అమాంతం పెరగడం, సీపీఐ పెరుగుదల, వేతనాల్లో అదే స్థాయిలో ఉండటం వంటి కారణాలతో కార్మికుల నిజవేతనాలు తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -