Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఠానూనాయక్‌ ఆశయాల సాధనకు పోరాటం

ఠానూనాయక్‌ ఆశయాల సాధనకు పోరాటం

- Advertisement -

నిజాం రజాకార్లపై ఉద్యమించిన యోధుడు : వర్థంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
గిరిజన బిడ్డల హక్కుల కోసం ఉద్యమించిన ఠానూనాయక్‌ ఆశయాల కోసం పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు సాధించాలనే పట్టుదల కల్గిన ప్రజా నాయకుడు ఠానూనాయక్‌ అని గుర్తు చేశారు. నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన యోధుడని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం సంయుక్తంగా ఠానూనాయక్‌ 77వ వర్థంతి సభను నిర్వహించారు. దీనికి టీజీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీరాంనాయక్‌, టీపీఎస్‌కె రాష్ట్ర కన్వీనర్‌ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

ఈసందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ గిరిజనుల భూమి కోసం పోరాడడమే కాకుండా వారిపై జరిగిన దాడులు, మహిళపై కొనసాగిన అత్యాచారాలను నిరంతరం ఎదిరించాడని చెప్పారు. భూఆక్రమణలను అడ్డుకున్నాడని తెలిపారు. దొడ్డి కొమురయ్య హత్యకు వ్యతిరేకంగా కూడా పోరాడాడని వివరించారు. ప్రపంచంలో గుర్తించదగిన పోరాటం.. తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. ఠానూనాయక్‌ లంబాడీల కోసమేగాక అణగిరిన వర్గాల కోసం పనిచేశాడన్నారు. బాంచన్‌దొరా అనే లక్షణం ఠానూనాయక్‌ది కాదని గుర్తు చేశారు. ఆయన కుటుంబం సైతం వీరత్వాన్ని కలిగి ఉందన్నారు. మార్క్సిస్టు మహానేత పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకంలో ఠానూనాయక్‌ గురించి రెండు పేజీలు రాశారనీ, అంతటి ఘన చరిత్ర ఠానూ నాయక్‌దని అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు.

భూములు పంచడానికి బదులు భూములను గుంజుకునే ప్రభుత్వాలు వచ్చాయని అన్నారు. పెట్టుబడిదారు లు, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదనీ, మతం, మతోన్మాదం ప్రాతిపదికలుగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు. మతోన్మాద రాజకీయాలు ముందుకొచ్చి పోరాటాలు, ఉద్యమాలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారిని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సగటున ఏడాదికి వెయ్యి మంది హత్యకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కదా అని ప్రశ్నించారు. అటవీ భూములను ఆక్రమిస్తూ గిరిజనులపై దౌర్జన్యాలు చేయడాన్ని ఖండించారు. నక్సలైట్లను ఏరివేసే కార్యక్రమానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయనీ, ఇందుకోసం మార్చి నెలాఖరును గడువుగా పెట్టుకున్నాయని చెప్పారు.

ఠానూనాయక్‌ చరిత్ర స్ఫూర్తిదాయకం : జూలకంటి రంగారెడ్డి
మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఠానూనాయక్‌ కుటుంబ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైనదని అన్నారు. తిరుగుబాటుకు నిర్వచనం ఠానూనాయక్‌ అని గుర్తు చేశారు. గిరిజన హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఠానూనాయక్‌తోపాటు ఆయన అన్నదమ్ములందరూ తెలంగాణ సాయుధ పోరాట యోధులని గుర్తు చేశారు. ద్రోహుల సమాచారంతో నెహ్రు సైన్యానికి చిక్కాడని చెప్పారు. ఆయన్ను బండి చక్రానికి కట్టి ముక్కలు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపోరాటాలు, ఉద్యమాల్లో పాల్పంచుకుంటూ ఠానూనాయక్‌ వీరమరణం పొందారని వివరించారు.

ఈ కార్యమ్రంలో టీజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్‌, సహాయ కార్యదర్శి మూడ్‌ బాలు, సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్‌నాయక్‌, ప్రొఫెసర్‌ శంకర్‌నాయక్‌, ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్కీ నాయక్‌, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు చందర్‌నాయక్‌, ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.రఘు, అవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎంవీ రమణ, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -