Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆవిష్కరణలు, స్థిరమైన అభివృద్ధికి రాయబారులు.. విద్యార్థులు

ఆవిష్కరణలు, స్థిరమైన అభివృద్ధికి రాయబారులు.. విద్యార్థులు

- Advertisement -

– తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పిలుపు
– స్వయం సంవృద్ధి, ఎగుమతి దేశంగా భారత్‌ : ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌
– ఘనంగా కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

జ్ఞానం, ఆవిష్కరణలు, స్థిరమైన అభివృద్ధికి రాయ బారులుగా విద్యార్థులుండాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పు, పంటకోత తర్వాత నష్టాలు, మార్కెట్‌ అస్థిరత వంటి అత్యంత ముఖ్యమైన ఉద్యానవన సవాళ్లను ఎదుర్కోవడానికి అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన భాగస్వామ్యాలు ఉండాలని తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో జరిగిన శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో గవర్నర్‌ పాల్గొని మాట్లాడారు. 353 మిలియన్‌ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తితో మన దేశం ప్రపంచ నాయకునిగా నిలుస్తోందన్నారు. పండ్లు, కూరగాయల్లో చైనా తర్వాత రెండవ స్థానంలో మనమున్నామని, అరటి, మామిడి, బొప్పాయి ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే ముందున్నామన్నారు. ఉల్లిపాయలు, అల్లం, బెండకాయల ఉత్పత్తిలోనూ అగ్రస్థానం మనదేనని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యాన శక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోంద న్నారు. 12.94 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు 61.64 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో ఈ రంగం రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిలో 34శాతం వాటాను కలిగి ఉందన్నారు.

ఇది కేవలం వ్యవసాయ విస్తీర్ణంలో 7శాతం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ మిరప ఉత్పత్తిలో రెండవ స్థానంలో, పసుపులో మూడవ స్థానంలో ఉందన్నారు. మామిడి పండ్లు భారతదేశం అంతటా, విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ములుగు జిల్లా ఎస్‌.తడ్వాయి మండలంలో ఉన్న కొండపర్తి అనే గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు సహాయం చేయడానికి విశ్వవిద్యాలయం ఆఫ్‌ క్యాంపస్‌ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ గ్రామం కారం, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల మిశ్రమాలను ఉత్పత్తి చేయగల మసాలా ప్రాసెసింగ్‌ యంత్రాల సంస్థాపనకు దోహదపడిందన్నారు. పటాన్‌చెరులోని ఇక్రిసాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ మాట్లాడుతూ..

భారతదేశం ఆహార కొరత ఉన్న దేశం నుంచి స్వయం సమృద్ధి, ఎగుమతి దేశంగా ఎదిగిందన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం మన దేశం 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. 2016-17 నుంచి 2022-23 వరకు వ్యవసాయం 5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. ఇప్పుడు దేశ స్థూల విలువ జోడింపునకు దాదాపు 20శాతం దోహదపడుతుందని 2024-25 ఆర్థిక సర్వే పేర్కొన్నట్టు చెప్పారు. అనంతరం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ డి. రాజి రెడ్డి స్వాగత ప్రసంగం చేసి విశ్వవిద్యాలయం పురోగతి నివేదికను సమర్పించారు.
విద్యార్థులకు బంగారు పతకాలు
బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌లో గుడిసె చైతన్య 4 బంగారు పతకాలు సాధించారు. అలాగే, డాక్టర్‌ హరిబాబు, విశ్వ శాంతి, డాక్టర్‌ నగేష్‌ మర్రి బంగారు పతకాలు సాధించారు. ప్లాంట్‌ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కోర్సుల్లో కొర్ర రోషిణి ఓజీపీఏ టాపర్‌గా నిలిచినందుకు డాక్టర్‌ కొమ్మ చంద్రశేఖర్‌రెడ్డి స్మారక బంగారు పతకం లభించింది. ఉద్యాన కోర్సుల్లో ఓపీపీఏ టాపర్‌గా కోతకాపు మౌనికా రెడ్డికి గజ్జల లక్ష్మి, బాలిరెడ్డి బంగారు పతకం లభించింది. బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీలో తొగితా రేణుక, సుదర్శి రమ్య బంగారు పతకాలు సాధించారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (ఎంఎస్సీ హార్టికల్చర్‌)లో అచ్చుత, మోనిక శ్రీ, నాగిని రెండు బంగారు పతకాలు, కూరగాయల శాస్త్రంలో టాపర్‌గా సింధుజాకు బోగ చంద్రయ్య, గంగు బాయి స్మారక బంగారు పతకం, ప్లాంటేషన్‌, సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటల్లో టాపర్‌గా రంజిత్‌కుమార్‌కు కేసర్‌ అన్నంవర్‌ స్మారక బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఫ్రూట్‌ సైన్స్‌లో టాపర్‌ దిశకు ఎస్‌.కె. నోవా ఐకాన్‌ బంగారు పతకం అందుకుంది. ఈ స్నాతకోత్సవంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స లర్‌ డాక్టర్‌ అల్డా జనయ్య, వెటర్నరీ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ జ్ఞాన ప్రకాశ్‌, సీసీఓఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌కె మాథుర్‌, వర్సిటీ అధికారులు డాక్టర్‌ ఎ.భగవాన్‌, డాక్టర్‌ జె.చీనా, సురేష్‌, సీనివాసన్‌, ప్రశాంత్‌, అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -