Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీసీలు ఇవ్వట్లేదని కలెక్టర్ కు విద్యార్థుల వినతి

టీసీలు ఇవ్వట్లేదని కలెక్టర్ కు విద్యార్థుల వినతి

- Advertisement -

– ప్రయివేట్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ 
– కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం
– తక్షణం విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని ఆదేశం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాల యాజమాన్యం తమకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు విద్యార్థులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి విన్నవించారు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అనంతరం తిరిగి వెళ్తూ కార్ ఎక్కబోతున్న కలెక్టర్ కు సార్ మా సమస్యలను పరిష్కరించండి అంటూ పలువురు విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. స్థానిక స్త్రీ బాధ్యత జూనియర్ కళాశాలలో తాము మొదటి సంవత్సరం పూర్తి చేశామని, రెండవ సంవత్సరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేందుకు 15 మంది విద్యార్థులం సిద్ధమయ్యామని కలెక్టర్ కు విన్నవించారు. తమ టీసీలు ఇవ్వాలని గత 15 రోజులుగా శ్రీ భాషిత జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని కోరుతున్న పట్టించుకోవడంలేదని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

మొదటి సంవత్సరం ఫీజు బకాయిలు కూడా పూర్తిగా చెల్లించినప్పటికీ టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ విషయమై తహసిల్దార్ తో మాట్లాడి సమస్య పరిష్కరించమని చెప్పాలని తన సిబ్బందికి కలెక్టర్ సూచించారు. సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులకు చెప్పి కలెక్టర్ వెళ్లిపోయారు. అనంతరం స్థానిక సింగిల్ విండో గోదామును పరిశీలించిన  ఆయన అక్కడ నుండి నేరుగా శ్రీ భాషిత జూనియర్ కళాశాలకు వెళ్లారు. అక్కడ సిబ్బందిని పిలిచి విద్యార్థులకు టీసీలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.తమ సార్ లేడని, సార్ కు చెప్తామని, ఫోన్ కలవట్లేదని కళాశాల సిబ్బంది కలెక్టర్ కు తెలుపగా ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సార్ ఎక్కడ ఉంటాడో చెప్పండి…నేనే అక్కడికి వెళ్తానంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం వరకు వారికి టీసీలు ఇచ్చేందుకు ఏం చేస్తారో చేయండి అని… లేకపోతే ఏం జరుగుతుందో మీరు చూస్తారు అంటూ కలెక్టర్ కళాశాల సిబ్బందిని హెచ్చరించారు.

ప్రభుత్వ కళాశాలలో  చదువుకుంటామని వెళ్లిన విద్యార్థుల్ని టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరైంది  కాదన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందిని పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. టీసీలు సమర్పించేందుకు ఎప్పటి వరకు సమయం ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈరోజే చివరి రోజు అని ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది సమాధానం ఇవ్వడంతో, ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం వారు ఆన్లైన్లో సదరు విద్యార్థుల డాటాను డిలీట్ చేస్తే తాము ఎంటర్ చేసుకుంటామని ప్రభుత్వం తెలిపారు.తక్షణమే టీసీలు ఇవ్వాలని శ్రీ భాషిత జూనియర్ కళాశాల సిబ్బందికి కలెక్టర్ సూచించారు. తాము చేసింది తప్పేనని, వెంటనే టీసీలు ఇస్తామని శ్రీభాషిత జూనియర్ కళాశాల సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. 

కళాశాల సిబ్బంది విద్యార్థుల టీసీలు ఇచ్చేవరకు ఇక్కడే ఉండి, రిఫరెన్స్ నంబర్లు తనకు పంపించాలని తహసిల్దార్ గుడిమెల  ప్రసాద్ ను  కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తహసిల్దార్ ప్రసాద్, మండల రెవెన్యూ అధికారి శరత్ శ్రీ భాషిత జూనియర్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి టీసీల కోసం వేచి చూస్తున్న ఐదుగురు విద్యార్థులకు దగ్గరుండి మరి టీసీలు ఇప్పించారు. మిగతా విద్యార్థులకు కూడా టీసీలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తహసిల్దార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -