– బాల్కొండ ఎమ్మెల్యే, హాస్టల్ ఆడ్వైజరి కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి
– ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి
– ప్రతి హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి, అందుకు అనుగుణంగా ప్రతి హాస్టల్లో రోజువారీగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, హాస్టల్ ఆడ్వైజరి కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే, హాస్టల్ ఆడ్వైజరి కమిటీ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, బీసీ హాస్టల్ అధికారులతో సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ హాస్టళ్ల నిర్వహణ, వసతి, ఆహార, శుభ్రత తదితర అంశాలపై సమీక్షించేందుకు ప్రశాంత్ రెడ్డి స్వయంగా అధ్యక్షత వహించి ఈ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గంలో 8 ఎస్సీ హాస్టల్స్, 5 బీసీ హాస్టల్స్ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ హాస్టళ్లలో వందలాది మంది పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా వసతి, భోజనం, విద్యా సదుపాయాలను పొందుతున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రతి హాస్టల్లో రోజువారీగా మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించాలన్నారు.
హాస్టల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరుగుదొడ్లు, స్నానాల గదులు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడాలని సూచించారు.శుభ్రత పాటించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనలు ప్రతి రోజు జరుగుతున్నందున అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి హాస్టల్ సూపరింటెండెంట్లు వారానికి ఒకసారి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనీ, సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ సమావేశం ముగింపు సందర్భంగా అధికారులందరూ తమ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి, హాస్టళ్లను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని అధికారులు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజ్‌గంగారాం, అసిస్టెంట్ బ్యాక్‌వర్డ్ కాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గంగాధర్, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.