కె.ఎల్.హెచ్ యూనివర్సిటీ విద్యార్థులతో మంత్రి వివేక్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థులు తమ లక్ష్య సాధన చేరుకునేంత వరకూ బాధ్యతలు మరిచిపోవద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ సూచించారు. కె.ఎల్.హెచ్ యూనివర్సిటీ బాచ్‌పల్లి క్యాంపస్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కె.ఎల్.యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మెమెంటోలను, మెడల్స్‌ను అందజేశారు. మెరిట్ విద్యార్థులకు ఏటా అందిస్తున్న రూ.100 కోట్ల స్కాలర్ షిప్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, బాధ్యత, ప్రణాళిక వంటి అంశాలపై సోదాహరణంగా విశ్లేషించారు. కళాశాల, యూనివర్సిటీలలో నేర్చుకునే విద్య అత్యంత విలువైనదని విద్యార్థులను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలను నిర్లక్ష్యం చేయొద్దనీ, వారు ఎన్నో కష్టాలు పడి తమ పిల్లల కోసం చేసే త్యాగాలను గుర్తించాలని హితవు పలికారు. కుటుంబ మర్యాదను, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి కట్టుబడి ఉందనీ, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తోందని చెప్పారు.
విదేశాలకు వెళ్లి విద్యార్థులు పడుతున్న కష్టాలను గుర్తించి మన రాష్ట్రంలోనే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు అమలు చేస్తోందని వివేక్ తెలిపారు. మెరిట్ విద్యార్థుల కోసం కె.ఎల్.యూనివర్సిటీ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ విధానం బాగుందని మంత్రి వివేక్ ప్రశంసించారు. కె.ఎల్.యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యారంగంలోనే కాకుండా అనేక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విద్యార్థులకు 100 శాతం స్కాలర్ షిప్ అందిస్తున్నట్టు చెప్పారు. శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజీఎం రవికుమార్, కె.ఎల్.హెచ్ బాచ్‌పల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ రవికుమార్, గ్లోబల్ బిజినెస్ స్కూల్ డీన్ ఆనంద్, యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి రాజేష్, జోనల్ హెడ్ రాజ్యలక్ష్మి, యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టటర్ హెచ్.ఎస్.ఆర్.మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



