నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సహాయక శిబిరాలు నీటమునిగినట్లు అధికారులు గురువారం తెలిపారు. మయూర్ విహార్ ఫేజ్-1 సమీపంలోని లోతట్టు ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లోని సహాయక శిబిరాలు నీటమునిగాయని అన్నారు. యమునా బజార్, యమునా ఖాదర్, నజాఫ్‌గఢ్, జైత్‌పూర్‌లు నీటమునగడంతో ప్రజలను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎన్ సివిల్ లైన్స్ ప్రాంతం, బేలా రోడ్డు వెంబడి భవనాలు నీట మునిగాయి. అలీపూర్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిలో కొంతభాగం కుంగిపోయింది.
యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం ఉదయం 7.00గంటలకు 207.48 మీటర్లుగా ఉంది. యమునా నదికి వరద పోటెత్తడంతో కాశ్మీర్ గేట్‌లో కొన్ని భాగాలు కూడా నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా, ఢిల్లీకి వరద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.