Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంజేపీసీ వేయండి

జేపీసీ వేయండి

- Advertisement -

లేదా న్యాయ విచారణ జరిపించండి : విమానయాన సేవల్లో అంతరాయంపై బ్రిట్టాస్‌ డిమాండ్‌
న్యూఢిల్లీ :
పౌర విమానయాన సేవలలో ఏర్పడిన అసాధారణ అంతరాయం పైన, భారీగా విమాన ఛార్జీల పెరుగుదల పైన దర్యాప్తు జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని లేదా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ (ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. పౌర విమాన సేవలు అసాధారణ రీతిలో నిలిచిపోవడంతో గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా విమాన చార్జీలు అపరిమితంగా పెరగడంతో ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని ఆయన ఆ లేఖలో వివరించారు. విమాన ప్రయాణ సమయాన్ని పరిమితం చేస్తూ సవరించిన నిబంధనల అమలు నియంత్రణకు సంబంధించిన సన్నద్ధతలో, ప్రయాణికుల రక్షణలో తీవ్రమైన సంస్థాగత వైఫల్యాన్ని బయటపెట్టిందని, దీంతో సాధారణ ప్రయాణికులు బాగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ‘దేశీయ మార్కెట్‌లో 63-65 శాతం వాటా ఉన్న ఇండిగో విమానాలను ఆకస్మికంగా రద్దు చేయడం, ప్రయాణాలు ఆలస్యంకావడం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలను స్తంభింపజేసింది. ఒక ప్రయివేటు ఆపరేటర్‌ వైఫల్యం మొత్తం వ్యవస్థ వైఫల్యానికి దారితీసింది. వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. టెర్మినల్స్‌ నేల పైనే నిద్రపోవాల్సి వచ్చింది. అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యారు. సవరించిన నిబంధనలు భద్రతను పెంచడానికి ఉద్దేశించినవే అయినప్పటికీ వాటి అమలులో కార్యాచరణ ప్రణాళిక లోపించింది. నిబంధనలను పాటించడానికి అవసరమైన సంసిద్ధత కూడా కరువైంది. దూరదృష్టి లోపించింది. ఊహించదగిన ఒత్తిడిలో వ్యవస్థ కుప్పకూలిపోయిన తర్వాత భద్రతా నిబంధనలను సడలించడం జరిగింది. కొన్నింటిని వెనక్కి తీసుకున్నారు. ప్రయాణికుల భద్రత వాణిజ్య ప్రయోజనాలకు లోబడి ఉన్నదనే ఆందోళన వ్యక్తమైంది’ అని ప్రధానికి రాసిన లేఖలో బ్రిట్టాస్‌ తెలియజేశారు.దేశీయ విమాన చార్జీలు దోపిడీ స్థాయిలో ఆకాశాన్ని అంటుకోవడంతో దీనిని లాభదాయక అవకాశంగా మార్చుకోవడం జరిగిందని బ్రిట్టాస్‌ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెరుగుదల ఇండిగోకు మాత్రమే పరిమితం కాలేదని, ఇతర విమాన సంస్థలు కూడా చార్జీలను బాగా పెంచేశాయని విమర్శించారు. ఇండిగో నడుపుతున్న దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసిన తర్వాత అనేక మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులు తమ ఎయిర్‌ ఇండియా టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిసిందని, రద్దు-చార్జీల పెరుగుదలతో వారిపై రెట్టింపు భారం పడిందని తెలిపారు.

‘చైనాలో మూడు పెద్ద విమాన సంస్థల మార్కెట్‌ వాటా కలిపినా 60 శాతం దాటలేదు. అమెరికాలో ఏ దేశీయ విమానయాన సంస్థ వాటా కూడా ఇరవై ఐదు శాతానికి మించదు. ఇది భారతదేశ ద్వంద్వ రాజకీయ నిర్మాణం ఎంత తీవ్రమైనదో, అసాధారణమైనదో తెలియజేస్తోంది. ప్రధాన విమానాశ్రయాలను ఏకకాలంలో కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడంతో కొత్త లేదా ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు తగ్గిపోయాయి. కేరళలోని కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ విదేశీ క్యారియర్లకు పాయింట్‌-ఆఫ్‌-కాల్‌ హోదాను తిరస్కరించారు. అదే గోవాలో కొత్తగా నిర్మించిన మోపా విమానాశ్రయానికి ఆ అవకాశం కల్పించారు’ అని బ్రిట్టాస్‌ తన లేఖలో ఎత్తిచూపారు. పైలట్లను తగినంత సంఖ్యలో నియమించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. విమాన ఛార్జీలు తమ నియంత్రణలో లేనివంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలనపై బ్రిట్టాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలిసే వ్యవస్థీకృత దోపిడీ జరుగుతోందని బ్రిట్టాస్‌ విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. లక్షలాది మంది నిస్సహాయులైన ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారని, రెండు విమానయాన సంస్థలు సొమ్ము చేసుకున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆశీర్వాదాలతో ద్వంద్వ పాలన నడిచిందని, దీని వెనుక ఓ కుట్ర ఉన్నదని చెప్పారు. డీజీసీఏ ఆదేశాల ఉపసంహరణ తర్వాత పౌర విమానయాన సేవల్లో అంతరాయం, ఛార్జీల పేరిట దోపిడీ వెనుక దాగి ఉన్న కుట్రను ఛేదించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని లేదా జ్యుడీషియల్‌ కమిషన్‌ను విచారణకు ఎందుకు నియమించాలో బ్రిట్టాస్‌ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -