బీహార్‌లో సర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈనెల 9 నాటికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలను వెల్లడించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 9 నాటికి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమల్యా బాగ్చితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీనిపై స్పందించిన ఈసీ, సర్‌లో భాగంగా విడుదల చేసిన తుది జాబితాలో చాలా మంది కొత్త ఓటర్లు ఉన్నారని సుప్రీంకోర్టుకు చెప్పింది. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదు, అప్పీల్ రాలేదని కోర్టుకు తెలిపింది.
”కోర్టు ఆదేశాలు ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకతను కల్పిస్తాయి. ముసాయిదాలో 65 లక్షల ఓట్లను తొలగించినట్టుగా కనిపిస్తోంది. ఎవరు చనిపోయినా, వలస వెళ్లినా తొలగించండి. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవరినైనా ఓటరుగా తొలగిస్తుంటే అందుకు సంబంధించిన రూల్ 21 ప్రకారం అనుసరించండి. ఎవరినైనా తొలగిస్తే వారి వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో పెట్టాలని కూడా చెప్పాం. తాజాగా విడుదల చేసిన తుది జాబితాతో ముసాయిదాను పోల్చి చూస్తే ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. ఈ గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరాలను బహిర్గతం చేయండి.”అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
3.66 లక్షల మంది పేర్లను తొలగించామన్న ఈసీ
అంతకుముందు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ 3.66 లక్షల మంది పేర్లను తొలగించామని తెలిపారు. భారతీయులు కానివారు, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయినవారు, ఓటరుగా ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకున్నవారి పేర్లనే తొలగించామని చెప్పారు. ”ఆగస్టులో ముసాయిదా ప్రచురణకు ముందే బీహార్ ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది పేర్లను తొలగించాం. నెల రోజుల పాటు సాగిన ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియతో మరో 3.66 లక్షల మంది పేర్లను తొలగించాం. తమ పేరును తప్పుగా తొలగించినట్టు ఎవరైనా భావిస్తే సంబంధిత జిల్లా ఎన్నికల కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవచ్చు” అని జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.