Friday, April 3, 2026
E-PAPER
Homeమానవివిజయానికి జెండర్ తో పనిలేదు

విజయానికి జెండర్ తో పనిలేదు

- Advertisement -

మన సమాజంలో ట్రాన్స్‌జెండర్‌గా బతకడం అంటే ఓ పోరాటం. వారు కూడా భావాలు, ఆశలు, కలలు కలిగిన సాధారణ మనుషులే. కానీ మన సమాజం వారిని మరో కోణంలో చూస్తుంది. కనుకనే వారి జీవితం సవాలక్ష సవాళ్లతో నిండిపోతుంది. వారిని అర్థం చేసుకోవడం కన్నా విమర్శించడం, అంగీకరించడం కన్నా దూరంగా ఉంచడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య వారిలో లేదు, వారిని చూసే మన దృష్టిలో ఉంది. అలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని నేడు డాక్టర్‌గా సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వి.ఎస్‌. ప్రియా జీవగాథ నేటి మానవిలో…

సాధారణంగా ట్రాన్స్‌జెండర్స్‌ అందరూ చిన్ననాటి నుంచే ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొంటారు. కుటుంబం నుంచి ప్రారంభమయ్యే ఈ నిరాకరణ, బయట ప్రపంచంలో మరింత పెరుగుతుంది. సాధారణ వ్యక్తులకు అందినట్లుగా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా వారికి సులభంగా అందవు. అయినప్పటికీ, వారు తమ జీవితాన్ని గౌరవంగా, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అందుకే వారి జీవితం సాధారణంగా సవాళ్లతో నిండిన ప్రయాణం. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులు సమాజానికి నిజమైన స్ఫూర్తి. అలాంటి వారిలో డాక్టర్‌. వి. ఎస్‌. ప్రియ ఒకరు.

తనకు నచ్చిన దిశలో…
కేరళ రాష్ట్రంలో జన్మించిన డాక్టర్‌. వి. ఎస్‌. ప్రియ చిన్ననాటి నుంచే తనను మహిళగా భావించేవారు. అయితే సమాజం, కుటుంబం, పరిసరాల ఒత్తిడి కారణంగా ఆ భావనను బయట పెట్టడం ఆమెకు చాలా కష్టంగా మారింది. కాలక్రమేణా ఆమె తన నిజమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని, తనకు నచ్చిన దిశలో జీవించాలని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించకపోయినా ఆమె పట్టుదల, ధైర్యం చూసి తర్వాత అంగీకరించారు.

అడ్డంకులు మనల్ని ఆపలేవు
ఆమె విద్యా ప్రయాణం సవాళ్లతో నిండినదే. లింగ గుర్తింపు కారణంగా పాఠశాల దశలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటిని లెక్కచేయకుండా తన లక్ష్యంపై దృష్టి సారించారు. వైద్యరంగంపై ఆసక్తితో ఆమె ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆమె త్రిసూర్‌ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందిస్తూ, తన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. ‘మన స్వప్నాలు నిజం కావడానికి జెండర్‌తో ఎలాంటి సంబంధం లేదు. మనం ఎంత కష్టపడతామో, ఎంత పట్టుదలతో ముందుకు సాగుతామో అదే ముఖ్యం. లింగ భేదం, సామాజిక అడ్డంకులు ఇవన్నీ మన లక్ష్యాలను ఆపలేవు’ అని నిరూపించారు.

విలువలు నేర్పాలి
మనలో నమ్మకం ఉంటే, ఏదైనా సాధించగలం. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనలోని అసలైన శక్తి బయటపడుతుంది. ప్రతి అడ్డంకి మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది, ప్రతి కష్టం మనల్ని లక్ష్యానికి మరింత దగ్గర చేస్తుంది. సమాజంలో ట్రాన్సజెండర్స్‌పై వివక్ష లేకుండా ఉండాలంటే మార్పు విద్యాసంస్థల నుంచే ప్రారంభం కావాలి. స్కూల్స్‌, కాలేజీల్లో వారిపై ఎలాంటి వివక్షా లేకుండా సమానంగా చూడడం అత్యంత ముఖ్యం. చిన్న వయసులోనే విద్యార్థులకు సమానత్వం, గౌరవం అనే విలువలు నేర్పితే భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది. అదే విధంగా ఉద్యోగాల్లో కూడా ట్రాన్సజెండర్స్‌కు సమాన అవకాశాలు కల్పించాలి.

సంకల్పం దృఢంగా ఉంటే…
ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే వారు కూడా సమాజంలో స్వాభిమానంతో నిలబడగలరు. ఇందుకోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఒక మంచి మాట, ఒక గౌరవం, ఒక అవకాశం. ఇవే వారి జీవితాన్ని మార్చగలవు. మనం ఒక్కొక్కరం మారితేనే సమాజం మొత్తం మారుతుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన సంకల్పం దృఢంగా ఉంటే విజయం మనదే అవుతుంది. యువతకు డాక్టర్‌ ప్రియా జీవితం ఒక గొప్ప ప్రేరణ. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాలి, ఇతరులను కూడా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.

లక్ష్యాన్ని వదలకుండా…
ప్రియలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఎన్నో అవరోధాలు, అపోహలు, విమర్శలు ఎదురైనా ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. చిన్ననాటి నుంచే తన వ్యక్తిత్వాన్ని అంగీకరించుకోవడం ఎంత కష్టం అనేది ఆమె ప్రయాణం చెబుతుంది. కుటుంబం, సమాజం నుండి వచ్చిన ఒత్తిడులను తట్టుకుని, తన స్వప్నాన్ని సాధించాలనే పట్టుదలతో విద్యను కొనసాగించడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

అవరోధాలను ఛేదించి
ఆమె కేవలం డాక్టర్‌గా ఎదగడం మాత్రమే కాదు, ట్రాన్స్‌జెండర్స్‌ సమాజానికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. ‘దృఢ సంకల్పం’ ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అనే సందేశాన్ని ఆమె జీవితం స్పష్టంగా చెబుతోంది. సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది వారికి అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. కానీ డాక్టర్‌ ప్రియా ఆ అవరోధాల అన్నిటినీ ఛేదించి, అవకాశాలుగా మలచుకొని, నేడు ఒక వైద్యురాలిగా సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

కోట దామోదర్‌,
9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -