నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ, సాహిత్య అకాడెమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో “తెలంగాణ మహిళల కథలు – వికాసం, విస్తృతి, వైవిధ్యం” అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ లో సింపోసియం నిర్వహించారు.ఈ సదస్సుకు సాహిత్య అకాడెమీ బెంగుళూరు శాఖ కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర రాజు.టి.ఎస్. స్వాగతోపన్యాసం పలికారు.
వర్సిటీ ఆర్ట్స్ కళాశాల డీన్, సదస్సు నిర్వహకులు ప్రొఫెసర్ కరిమిండ్ల లావణ్య ప్రారంభోపన్యాసంలో అందరిని ఉత్సాహపరుస్తూ ఉపన్యాసించారు.మొత్తం ప్రపంచంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎంతో ప్రభావం చూపించిందని, రైతాంగ పోరాటమే తెలంగాణ మహిళలు కథలు రచించడానికి ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కరిమిండ్ల లావణ్య రచించిన సాహితీ కిరణాలు అనే సాహితీ కిరణాలు (విమర్శన వ్యాసాలు అనే సంపుటిని ఎస్వి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ప్రారంభ సమావేశంలో సాహిత్య అకాదెమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎస్వీ. సత్యనారాయణ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ తెలంగాణ మూలాలు తెలంగి, తెలుగు నుండి వచ్చాయన్నారు. తెలంగాణ తొలితరం కథకులుగా వట్టికోట ఆళ్వారుస్వామి నిలుస్తారని తెలిపారు. మొదటి సమావేశానికి తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు పి. కనకయ్య అధ్యక్షత వహిస్తూ తెలంగాణలో మాత్రమే కాదు తెలుగు సాహిత్యంలోనే ఎంతో మంది స్త్రీలు చరిత్రలో నిలిచిపోయారని, వారి జీవితాలను ఆధారంగా చేసుకుని వారిపై కథలు, నవలలు వెలువడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆచార్య వంగరి త్రివేణి తొలి తరం కథలు (1956 వరకు) అనే అంశం పైన పత్ర సమర్పణలో తొలితరం తెలంగాణ కథల గురించి ప్రారంభం నుండి 1956 వరకు వెలువడిన కథలను గురించి పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలోనే తొలి కవయిత్రిగా మొల్ల కనిపిస్తుంది అని చెప్తారు. కానీ ఆమె కంటే ముందే కుప్పాంబిక రచనలు చేసిందని పేర్కొన్నారు. కథా సాహిత్యానికి గురజాడను ఆద్యుడుగా పేర్కొంటారు కానీ ఆయనకంటే ముందే తెలంగాణ ప్రాంతం నుండి కథలు వెలువడ్డాయని పేర్కొన్నారు. తెలుగులోనే తొలి కథా రచయిత బండారు అచ్చమాంబ నిలుస్తారని పేర్కొన్నారు. ఆంధ్రుల పరిపాలన మూలంగా తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రాలేకపోయింది వివరించారు.ఎన్. సంధ్యారాణి 1956 నుండి 1970 మధ్య సంది యుగంలో నిలబడిన కథ సాహిత్యాన్ని గురించి పాత్ర సమర్పణ చేశారు. యశోద రెడ్డి అచ్చమైన తెలంగాణ భాషలో తెలంగాణ చరిత్రను సంస్ధిని తెలిపేలా కథలు రాశారని చెప్పారు ఆనాటి కథలు స్త్రీ పురుష సంబంధాల గురించి కథలను ఎక్కువగా వచ్చాయని రూపుమాటి కుటుంబాలకు సంబంధించిన కథలను కూడా సంధి యుగంలో వెలువడ్డాయని పేర్కొన్నారు.
ఎన్. రజిని తన పత్ర సమర్పణలో 1971 నుండి 1995 మధ్యకాలంలో విలువడిన కథల గురించి పాత్ర సమర్పణ చేశారు. రచయితలు పుట్టిన కాలాన్నే కాదు వారు చైతన్యం పొంది రచనలు చేసిన కాలాన్ని ప్రామాణికంగా చూడాలని వారి జీవితం కంటే కూడా వారి సాహిత్య జీవితం ఎలా ప్రారంభమైందనే విషయాలని ప్రామాణికంగా తీసుకొని వారి రచనకు ప్రోత్సాహం ఎక్కడ నుంచి లభించిందో దానినే మన సాహిత్యానికి పునాదిగా స్వీకరించాలని పేర్కొన్నారు. స్త్రీలు రచయితలుగా ప్రాచీర్యం పొందకపోవచ్చు కానీ వారి కథలలో వస్తువు మాత్రం ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉందని రాసిన కథా రచయితలు అందరూ కూడా అద్భుతమైన కథల వివరించాలని అందులో విప్లవకథలను కూడా విలువరించిన వారు ఉన్నారని పేర్కొన్నారు.
వెల్దండి శ్రీధర్ తన పత్ర సమర్పణలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను కేంద్రంగా చేసుకుని కథలు వెలువడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం భాష మరియు సాహిత్యం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందిందని, సామాజిక, సాంస్కృతికపరమైన మార్పును మనమంతా ఉద్యమం ద్వారా సాధించామని తెలిపారు. 2014 నుండి 2025 మధ్య కాలంలో సుమారు 56 మంది రచయిత్రులు ఆక్టివ్ గా కథలు రాస్తున్నారని ఈ సదస్సుకోసం వారు 108 కథలను పరిశీలించానని అందరూ అద్భుతమైన కథలు రాస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కథా రచయిత్రులు అటు ఆనాడు తెలంగాణలో ఉన్న ఆధిపత్యాన్ని, ఇటు కుటుంబంలో స్త్రీలపై ఉన్న ఆధిపత్యాన్ని ఏక కాలంలో చిత్రిస్తూ కథలు రచించిన ఉద్యమకారులన్నారు.
ఆంధ్ర ప్రాంత కథా సంపుటాలను వెలువరించిన కాలంలో ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన కథలను ఎక్కువగా స్వీకరించకుండా తెలంగాణ ప్రాంతం నుండి అనుకున్నంత స్థాయిలో సాహిత్యం వెలువడడం లేదనే విమర్శలు చేశారని పేర్కొన్నారు. అందుకు సమాధానంగానే 2013 నుండి సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ కలిసి తెలంగాణ ప్రాంతం నుండి వెలువడుతున్న కథలలో ఉత్తమ కథలను స్వీకరించి కథా సంపుటాలను ప్రతి సంవత్సరం వెలువరిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం అమరులైన అమరవీరులమీద, నోట్ల మార్పిడి మీద, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలమీద కథలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహాలక్ష్మి పథకం క్రింద స్త్రీల ఉచిత బస్సు ప్రయాణాల మీద కథలు రావడం లేదని, ఇలాంటి ఇతివృత్తలను ఎన్నుకుని స్త్రీలే కథలు రాయాల్సిన ఆవశ్యకత ఉందని సందేశం ఇచ్చారు. మధ్యాహ్న సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సమావేశానికి డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. రెండవ సమావేశంలో ఎం. దేవేంద్ర 1995 నుండి 2014 వరకు రెండు దశాబ్ధాల కథానికలం గురించి పత్ర సమర్పణ చేశారు. 1995 తర్వాత తెలంగాణ కథాసాహిత్యంలో ఒక ప్రత్యేక అస్తిత్వ ఉద్యమాల ఉనికి కనిపిస్తుందని ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, మన భాష, మన యాస, మన సంస్కృతి వంటి వాటిని తెలంగాణ కథా రచయిత్రులు వస్తువులుగా స్వీకరించి తమ కథా రచన చేశారని వివరించారు. ముగింపు సమావేశానికి ప్రముఖ రచయిత్రి, విమర్శకులు ఆచార్య ముదిగంటి సుజాత రెడ్డి తెలంగాణ కథ ప్రారంభ దశ నుండి వికాస దశకు చేరుకున్న సందర్భాన్ని, స్త్రీల కథా రచనకు బీజాలుగా నిలిచిన సందర్భాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి తెలుగు భాషోపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.


