క్రీడలపై సినిమాలు అంటే ప్రేక్షకులు ఉత్కంఠతో వీక్షిస్తారు. అందులోనూ, స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరి అనుబంధం, సెంటిమెంట్ మొదలైన విషయాలు జత కూడితే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుంది.
సాధారణంగా ఏ క్రీడను ఆధారం చేసుకుని కథను అల్లిన ఆ చిత్రానికి ప్రేక్షకుడు కనెక్ట్ కావటం సహజం. అది బయోపిక్ కావొచ్చు, ఏ వ్యక్తినైనా స్పూర్తిగా తీసుకుని నిర్మించిన చిత్రం కావొచ్చు. అలాగే, మహిళలు కూడా విభిన్న క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించే ఉదంతాలను గమనిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మహిళా క్రీడాకారులపై నిర్మించిన చిత్రాలయితే మరింతగా ఆదరణ పొందుతాయి.
2016 సం.లో కుస్తీ పోటీ ప్రధాన అంశంగా రెండు హిందీ చిత్రాలు విడుదలై ఆ రెండూ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం విశేషం. ఒకటి సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ ల ‘సుల్తాన్’ మూవీ కాగా, మరొకటి అమీర్ ఖాన్ ‘దంగల్’. దంగల్‌లో తన వారసత్వంగా తన కూతుర్లను కుస్తీ పోటీల్లో అగ్రగామిగా నిలబెట్టిన హీరో కథను అద్భుతంగా చిత్రిక పట్టాడు దర్శకుడు. దంగల్ చిత్రం మహావీర్ సింగ్ ఫోగాట్ బయో పిక్.
ఇక ‘సుల్తాన్’ చిత్రం విషయానికి వస్తే… ఈ చిత్రం 6 జూలై 2016 న ఈద్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో సుల్తాన్ అలీఖాన్‌గా సల్మాన్ ఖాన్ నటించాడు. టైటిల్ రోల్ అతనిదే అయినా, వన్ మ్యాన్ షో కాదు ఈ చిత్రం. అతనికి స్ఫూర్తి నిచ్చిన ఆర్ఫా పాత్రలో అనుష్క శర్మ కూడా అతనికి సమ ఉజ్జీగా నిలవడం వలన ఈ కథకు మంచి బలం చేకూరింది.
హీరో సుల్తాన్ (సల్మాన్ ఖాన్) తన కెరీర్‌ను ఎలా మలచుకోవాలో, ప్రొఫెషనల్‌గా ఎలా ఎదగాలో తెలియని స్థితిలో అతను మల్ల యోధురాలు అయిన ఆర్ఫా (అనుష్క శర్మ) ప్రేమలో పడతాడు. ఒలిపిక్స్‌లో బంగారు పతకం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న ఆమె ఎటువంటి లక్ష్యమూ లేని అతని ప్రేమను తిరస్కరిస్తుంది. రెజ్లింగ్‌లో అతను ఉన్నత స్థానానికి చేరితేనే అతని ప్రేమను అంగీకరిస్తానని షరతు పెడుతుంది.
సుల్తాన్ అంచెలంచెలుగా ఎదిగి కొద్ది రోజుల్లోనే రెజ్లింగ్‌పై పట్టు సాధిస్తాడు. రింగులో ప్రత్యర్థులతో హోరాహోరీ తలపడి విజయాలను సొంతం చేసుకుంటాడు. హీరో, హీరోయిన్‌లు వివాహం కూడా చేసుకుంటారు. హీరో రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో విజయాలను సొంతం చేసుకుని ఒలింపిక్స్‌లో కూడా గెలుపొందుతాడు.
అయితే, కొన్ని మలుపుల అనంతరం అతని విజయవంతమైన కెరీర్ అతని వ్యక్తిగత జీవితంలో చీలికను సష్టిస్తుంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో అతను కొడుకును కోల్పోతాడు. చివరిలో మరలా కూతురును కంటారు ఇద్దరూ. చాలా అద్భుతమైన సెంటిమెంట్ కెమిస్ట్రీ వీరిద్దరి మధ్యా పండుతుంది. ఈ సన్నివేశాలే సినిమాను పై స్థాయిలో నిలబెట్టాయని చెప్పవచ్చు.
అలీ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేటింగ్‌లో 3/5 వున్నా కూడా కలెక్షన్స్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. అప్పటి వరకు హిందీ సినిమాల్లో టాప్ 10 స్థానాల్లో పదవ స్థానంలో నిలిచి, యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఘనతను నిలబెట్టింది. ఈ చిత్రం 90 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినా కూడా, పెట్టిన బడ్జెట్‌కు ఎన్నో రెట్లు కలెక్షన్స్ సాధించింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ చిత్రం సక్సెస్ అయింది.
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్.. ఇద్దరి పాత్రలూ రెజ్లర్స్ కావడం విశేషం. అయితే, హీరో పాత్రను ముందుగా వేరే వారిని అనుకున్నా, ఆది సల్మాన్‌ఖాన్‌ను వరించటం, అతని బాడీ ఈ చిత్రానికి కరెక్ట్‌గా సరిపోవడం వలన అతని నటన అద్భుతంగా అనిపిస్తుంది. అతనికి సమ ఉజ్జీగా అనుష్క శర్మ కూడా చాలా బాగా నటించిందని చెప్పాలి. ముందుగా, దీపికా పదుకొనె, ఆ తర్వాత కంగనా రనౌత్‌లను ఆర్పా పాత్రకు అనుకొని వారు తిరస్కరించాక, అనుష్క శర్మ అంగీకారంతో ఆ పాత్ర ఆమెను వరించింది. పాత్ర ధరించే విషయంలో కొందరు తీసుకున్న పొరపాటు నిర్ణయాలు మరొకరికి అదష్టాన్ని తీసుకు వస్తాయి. అనుష్కశర్మలో ఒక మంచి నటిని వెలికి తీసుకు వచ్చింది ఈ మూవీ. ఈ చిత్రం బయో పిక్ అనటానికి తగిన ఆధారాలు దొరకలేదు.
– పంతంగి శ్రీనివాస రావు,
9182203351