Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeకథమట్టిలో సూర్యుడు

మట్టిలో సూర్యుడు

- Advertisement -


నాలుగేళ్ల పాప చేతులకు దొరకకుండా పరిగెత్తింది. తన వెనుకే పరిగెత్తాడు. ఎత్తుకోవాలని, ముద్దాడాలని, తనివితీర చూసుకోవాలని ఆశ, తాపత్రయం. పాప మాత్రం దొరకలేదు, నెమ్మదిగా మసకబారిపోయింది.
చిన్నారి ముఖాన్ని దోసిళ్ళలోకి తీసుకోవాలని తహతహలాడాడు. కుదరలేదు, కుదరకుండా చేశారు. అర్ధించాడు, ప్రాధేయపడ్డాడు, కాళ్ల మీద పడి బోరున విలపించాడు.
నుదుటి మీద చెమట బొట్లు మొలకెత్తి చెంపల మీద మహావక్షాల్లా విస్తరించి, ఎండిపోయాయి.
పల్లెవెలుగు బస్సు హడావిడిగా, గందరగోళంగా, అరుపులతో బిర్రుగా ఉంది. క్యాన్ల నుండి పాలు ఒలికిపోతాయని డ్రైవర్‌ మీద పెద్ద కేక పెట్టాడు వీరన్న. వీరన్న కేక డ్రైవర్‌ కి అందలేదు. మధ్యలోనే ఊపిరి కోల్పోయి గాల్లో కలిసిపోయింది.
పాల క్యాన్ల పక్కన కూరగాయల గంపలను ఇరిగించి సర్దింది శాంతమ్మ. పాలక్యాన్ల రాపిడి కారణంగా గంపల్లో ఉన్న కూరగాయలు నలుగుతాయని శాంతమ్మ అనవసర భయం. ఆ భయాన్ని తన నుండి వేరు చేయడం ఎవరి తరం కాదు.
వాటి ఎదురు సీట్లలలో పులివెందుల లయోలా కాలేజ్‌లో డిప్లొమా చదివే పిల్లలు కాస్త దూరంలో ఉన్న అమ్మాయిల గురించి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్లను గమనించిన ఒక పెద్దాయన పిల్లలు చెడిపోయారని గొణిగాడు. గొణుగుతూనే తన పక్కన కూర్చున్న సరోజ జబ్బలను రుద్దాడు.
సరోజ కోపంగా చూసింది కానీ ఏమీ అనలేకపోయింది. ఏదైనా అంటే బస్సులో వాళ్లు సరోజనే నిందిస్తారు, ఆడిపోసుకుంటారు. నలుగురు నాలుగు మాటలు అని తన వ్యక్తిత్వాన్ని బలపనూరు గంగమ్మ గుడి దగ్గరున్న కట్ట మీద చర్చకు పెడతారు, తీర్మానాలు చేస్తారు. దాన్ని ఎదురుకోవడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయింది.
సరోజ మాత్రమే కాదు బస్సు అనే మినీ ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వేల మంది మహిళలు మౌనంగానే ఉంటున్నారు. నీచ బుద్దులు, వికత చూపులు కుళ్లిపోవాలంటే మౌనం బద్దలవ్వాలి.
డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, మూలుగులు, శాపాలు, తిట్లు. బస్సు డ్రైవర్‌ అవేవి పట్టించుకోకుండా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ వాడిని తిట్టాడు. ట్రాక్టర్‌ వాడు కూడా డ్రైవర్‌ని అమ్మనా బూతులు తిట్టాడు. అక్కలను, చెల్లెలను, తల్లులను తిట్టుకొని వాళ్ల కోపాన్ని చల్లబరుచుకున్నారు.
ఎదురు సీటు కడ్డీ మీద తల వాల్చి ఆలోచనల సుడిగుండంలో ఉన్న గంగిరెడ్డి తల పైకెత్తి చూశాడు. నిద్రను త్యాగం చేసిన ఎర్రని కన్నులను తుడుచుకున్నాడు. చెంపల మీది కన్నీటి చారికలను రెండు చేతులతో కోశాడు.
మగవాడికి ఏడ్చే అర్హత లేదు. ఏడ్పు కూడా నవ్వులాగే ఒక ఎమోషన్‌ అని అర్థం చేసుకునే దశకు సమాజం ఇంకా ఎదగలేదు. ఆడవాళ్లకు నియంత్రణలు ఉన్నట్లే మగవాళ్లకు కూడా ఉన్నాయి. ఏడవడం, సిగ్గుపడటం లాంటివి అనేకం చేయకూడదు. అలా చేసే మగవాళ్లను సమాజం పురుషుడిగా గుర్తించదు.
మగవాడు గంభీరంగా మాట్లాడాలి. హావభావాలు, చూపులు పదునుగానే ఉంచుకోవాలి. సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి. అలా చేయకపోతే ఆడింగలోడని, నిఖార్సయిన మగ పుట్టుక కాదని నిందలు పడాల్సిందే.
ఇప్పటికే గంగిరెడ్డి చాలా పడుతున్నాడు. కొత్తగా మరే సమస్యనూ ఆహ్వానించలేడు. ఆలోచనల్లో ఉండగానే బస్సు పులివెందుల బస్స్టాండ్‌కి చేరింది.
బస్సు దిగి తల్లిదండ్రులతో ఆటోలో కోర్టుకు బయలుదేరాడు. గంగిరెడ్డి ముఖాన్ని చూసి తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది. తండ్రి బాధగా తల దించుకున్నాడు.
కోర్టు గ్రౌండ్‌లోకి అటో వెళ్లింది. ఆటో దిగగానే ముగ్గురి చూపులు హారిక కోసం గాలించాయి. దూరంగా వేప చెట్టు కింద హారిక ఆడుకుంటూ కనపడింది. బిడ్డ దగ్గరకు పరుగు లాంటి నడకతో గంగిరెడ్డి పరిగెత్తాడు. హారికను ఎత్తుకునే లోపే వెంకటలక్ష్మి పాపను లాక్కుంది.
గంగిరెడ్డి వైపు కోపంగా, అసహ్యంగా చూసింది. బిడ్డను ముట్టుకునే అర్హత లేదని వెంకటలక్ష్మి చూపుకు అర్థం. భార్య వైపు దీనంగా చూశాడు. హారికను లాక్కొని కోర్టులోకి రుసరుసలాడుతూ వెళ్లింది.
గంగిరెడ్డి కూడా కోర్టులోకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత వాదనలు పూర్తి అయ్యాయి. వెంకటలక్ష్మి, గంగిరెడ్డికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. వెంకటలక్ష్మికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు భరణంగా ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. హారికను నెలకు ఒకసారి గంగిరెడ్డి దగ్గరకు పంపాలని వెంకటలక్ష్మికి కోర్టు సూచించింది.
గంగిరెడ్డి, వెంకటలక్ష్మి పెళ్లి జరిగి ఎనిమిదేళ్ళు అయ్యింది. పెళ్లి జరిగిన నాలుగేళ్లకు హారిక పుట్టింది. కోర్టు తీర్పు వినగానే గంగిరెడ్డి స్పహ కోల్పోయాడు. ఎవరో ముఖం మీద నీళ్లు చల్లారు. అందరూ చుట్టూ మూగారు.
అప్పుడే నాటకాలు మొదలుపెట్టాడు చూడు అంటూ వెంటకలక్ష్మి తిట్టుకుంది. నాన్న అంటూ హారిక కేకలు పెట్టి ఏడ్చింది. బిడ్డను బలవంతంగా ఈడ్చుకువెళ్లారు. హారిక ఏడ్పు గంగిరెడ్డి చెవులను హింసించింది.

కోర్టు తీర్పు ప్రకారం ప్రతి నెల ఐదు వేల రూపాయలు పంపాడు. వెంకటలక్ష్మి మాత్రం హారికను గంగిరెడ్డి దగ్గరకు పంపలేదు. ఇంటి దగ్గరికి వెళ్లి బతిమిలాడాడు, గొడవపడ్డాడు, తన్నులు తిన్నాడు. హారికను చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వస్తే నరుకుతామని వెంకటలక్ష్మి తమ్ముళ్లు హెచ్చరించారు. బావను చితకబాది, తన్ని తరిమేశారు.
నెలలు గడిచాయి. బిడ్డను చూసుకోలేకపోతున్నాననే బాధను తట్టుకోలేకపోయాడు. భోజనం తినడం మానేశాడు. తల్లి బలవంతంగా తినిపిస్తోంది. బట్టలు మార్చుకోవడం మర్చిపోయాడు. తల్లి స్నానం చేయించి, బట్టలు మార్చింది.
గంగిరెడ్డి తండ్రికి బలపనూరులో ఐదెకరాల పొలం ఉంది. తండ్రి-కొడుకులు పొలం దున్నితేనే బతుకు బండి ముందుకు సాగుతుంది. కొడుకు పిచ్చివాడిలా బాధపడుతూ ఉంటే తండ్రి పొలానికి వెళ్లడం మానేశాడు. పూట గడవడమే కష్టంగా మారింది. కన్నుల ముందే చెట్టంత కొడుకు మోడుబారిపోవడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
గంగిరెడ్డి దీనస్థితి చూసి కోడలి ఇంటికి వెళ్లి మనవరాలిని ఒక్కసారైనా పంపమని అడుక్కున్నారు. సంపాదించడం చేతకాని వాడికి మా బిడ్డను ఇవ్వడమే మేం చేసిన పెద్ద తప్పు. డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి సిటీలో ఉద్యోగం వస్తుందిలే అనుకున్నాం కానీ మా బిడ్డను మట్టి పనులు చేయిస్తాడు అనుకోలేదు.
ఇదిగో అదిగో అంటూ ఎనిమిదేళ్లు గడిపేశాడు. పుట్టింట్లో సుఖంగా, పాదం కింద పెట్టకుండా పెరిగిన మా బిడ్డతో పొలం పనులు చేపించారు. సిటీలో ఉద్యోగం ఇప్పిస్తే రెండు నెలలు తిరక్కుండానే వెనక్కి వచ్చేశాడు. ఆ పాడు పల్లెలో ఉంటే హారిక బతుకు కూడా దానిలాగే అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హారికను పల్లెకు పంపేది లేదు. మిమ్మల్ని కలవనించేది లేదు. వెంకటలక్ష్మి, హారిక సిటీకి వెళ్లిపోతారు. ఇక వాడికి కనపడరు. ఇంకోసారి మీరు ఇంటికి వస్తే కేసు పెడతామని బెదిరించారు.
పెట్టండి కేసు.. మాకేమైనా భయమా? బిడ్డను తండ్రి నుండి దూరం చేసే హక్కు ఎవరికీ ఉండదు. నా మనవరాల్ని మా దగ్గరకు ఎందుకు పంపారో అదీ చూస్తామని గొడవపడ్డారు.
బిడ్డ వస్తుందేమోనని గంగిరెడ్డి ఇంటి ముందే ఎదురుచూశాడు. హారిక రాలేదు, ఇక రాదని, దూరంగా వెళ్లిపోతోందని తెలిసి కుప్పకూలిపోయాడు.
బిడ్డ దూరంగా ఉన్న సుఖంగా ఉండాలని భావించాడు. బాధను దిగమింగాడు. పొలం పనుల్లో తీరిక లేకుండా గడిపాడు. ప్రతి నెల క్రమం తప్పకుండా వెంకటలక్ష్మికి ఐదు వేల రూపాయలు పంపాడు.
ఆరు నెలల తర్వాత, ఒకరోజు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఏదో కాగితం వచ్చింది చూడమని గంగిరెడ్డి తల్లి కాగితాన్ని అందించింది.
కాగితాన్ని తెరిచి చూశాడు. నెల నెల పంపే ఐదు వేల రూపాయలు సరిపోవడం లేదని ఇక నుండి బిడ్డకు, తనకు పదహైదు వేల రూపాయలు పంపాలని వెంకటలక్ష్మి కోర్టులో కేసు వేసింది. వచ్చే మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఉంది.
పదహైదు వేల రూపాయలా? అంటూ గంగిరెడ్డి తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకున్నారు. గాడిద చాకిరీ చేస్తున్నా కూడా పొలం సరిగా పండటం లేదు. వచ్చేది మొత్తం వాళ్లకే పంపితే ఇక మనమెలా బతికేదని విలపించారు.

ఆరు నెలల తర్వాత హారికను చూసి గంగిరెడ్డి పులకించిపోయాడు. బిడ్డ దగ్గరకు పరిగెత్తాడు. బిడ్డను తాకే అవకాశం వెంకటలక్ష్మి ఇవ్వలేదు.
కోర్టులో వాదనలు మొదలయ్యాయి.
ఖర్చులు పెరిగిపోయాయని, బిడ్డ స్కూల్‌ ఫీజులు, భోజనం, ఇతర ఖర్చులు ఎక్కువయ్యాయని ఇకమీదట నుండి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఒక ఎకరా పొలం కూడా రాయించాలని వెంకటలక్ష్మి లాయర్‌ వాదించాడు.
వచ్చే ఆదాయం మొత్తం వాళ్లకే పంపితే గంగిరెడ్డి తన తల్లిదండ్రులు ఎలా పోషించగలడు? తన ఆదాయాన్ని బట్టే భరణం ఉండాలనీ గంగిరెడ్డి లాయర్‌ తన వాదనలను వినిపించాడు.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. కేసు వాయిదా వేసింది.

పదహైదు వేల రూపాయలు పంపగలిగితే బిడ్డ జీవితం బాగుంటుందని నమ్మిన గంగిరెడ్డి పొలం పనులతో పాటు బేల్దారి పనికి, వేరే వాళ్ల పొలాల్లో కలుపు తీయడానికి, చెన్నిక్కాయలు వలచడానికి, ఉపాధి హామీ పనికి కూడా వెళ్ళాడు.
కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ పదహైదు వేల రూపాయలు పంపడం మొదలుపెట్టాడు. పొలం మాత్రం రాయించనని చెప్పాడు. కేసు నెలకు ఒకసారి వాయిదా పడుతూనే ఉంది.
సంపాదించాలి, ప్రతి నెల డబ్బు పంపాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. భార్య బిడ్డలకు ఏదీ తక్కువ కాకూడదని గొడ్డుచాకిరీ చేసి చేసి అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యం సహకరించకపోయినా పనిలోకి పోయాడు. వద్దని వాదించినా, బతిమిలాడినా తల్లిదండ్రుల మాట వినలేదు.
పని.. పని.. పని..
డబ్బు.. డబ్బు.. డబ్బు..
భరణం.. భరణం.. భరణం..
బిడ్డ.. భార్య.. బిడ్డ.. భార్య..
ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి బేల్దారి పనికి వెళ్ళాడు. వస్తూ వస్తూ తల్లికి ఇష్టమైన జిలేబి తీసుకెళ్లాడు. అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. తల్లికి ఇష్టమైన జిలేబి నోటికి అందించాడు. బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
చెప్పకూడదు అనుకున్నారు కానీ చెప్పకుండా ఉండలేకపోయారు.
”వచ్చే నెలలో వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తున్నారు అంటా” తల్లి గంగిరెడ్డికి చెప్పింది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా లేచి గదిలోకి వెళ్లి మంచం మీద కూలబడ్డాడు. పల్లెను వదిలి, తల్లిదండ్రులను వదిలి రాలేనని చెప్పడమే నేను చేసిన నేరమా? నేను ఇంటి నుండి వెళ్లిపోతే నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? ఎందుకు నన్ను వెంకటలక్ష్మి అర్థం చేసుకోలేకపోయింది.
జీవితం అంటే డబ్బేనా? ఐదు వేల నుండి పదహైదు వేలు ఇవ్వమని అడిగినా ఒళ్లు హూనం అయ్యేలా పని చేస్తున్నానే. అయినా హారికను నాకు ఎందుకు దూరం చేసింది? తను పెళ్లి చేసుకుంటే హారిక పరిస్థితి ఏమిటి?
హారిక.. హారిక.. హారిక.. గట్టిగా అరిచాడు. బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు గంగిరెడ్డి దగ్గరికి వెళ్లి ఓదార్చారు. తన పక్కనే నిద్రపోయారు.
”గంగిరెడ్డి తల్లిదండ్రులను సూర్యుడు నిద్రలేపాడు కానీ గంగిరెడ్డిని లేపలేదు.”
– జాని తక్కెడశిల, 7259511956

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad