ఎన్నికల అధికారికి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న లేఖ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్
నవతెలంగాణ-బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాగంటి సునీత.. గోపీనాథ్ భార్య కాదని, ఆమె లీవ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవారని గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు బుధవారం ఎన్నికల అధికారికి లేఖ రాశారు. సునీత తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. లేఖలో తారక్ ప్రద్యుమ్న పేర్కొన్న వివరాలు.. ”నా తల్లి మాలినీదేవిని మాగంటి గోపినాథ్ 1998 ఏప్రిల్ 29న హిందూ వివాహ చట్టం ప్రకారం పెండ్లి చేసుకున్నారు.
ఆ వివాహం చట్టబద్ధంగానే 2025 జూన్ 8న గోపినాథ్ మరణం వరకు కొనసాగింది. వారిద్దరికీ ఎటువంటి విడాకులూ మంజూరు కాలేదు. చట్టబద్ధమైన వివాహం ద్వారా పుట్టిన ఏకైక కుమారుడిని నేనే. మాగంటి సునీత గోపినాథ్‌తో లీవ్‌ఇన్ రిలేషన్‌లో మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ఆమె తనను చట్టబద్ధ భార్యగా చూపిస్తూ ఎన్నికల అఫిడవిట్ సహా పలు అధికారిక పత్రాలలో తప్పుడు వివరాలు సమర్పించారు. ఆమె అఫిడవిట్‌లోని సమాచారాన్ని పరిశీలించి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి” అని తారక్ ప్రద్యుమ్న ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.
అన్ని వివరాలు సక్రమమే : మాగంటి సునీత
మాగంటి సునీత షేక్‌పేట్ ఆర్వో కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌లో పేర్కొన్న వివరాలన్నీ సక్రమమైనవేనని ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు డిక్లరేషన్ ఫారమ్ సమర్పించారు. నామినేషన్ పత్రాల్లో ఎలాంటి లోపాలూ లేకపోవడంతో ఇప్పటికే ఆమె నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ ఆమోదించింది.