Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వండి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వండి

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ టీజేఎస్‌ పార్టీని కోరారు. బుధవారం హైదరాబా ద్‌ నాంపల్లిలోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయానికి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మద్దతు కోసం వచ్చారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, రాష్ట్ర కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ నిరంకుశ బీఆర్‌ఎస్‌ పాలనను ముగించడంలో కోదండరాం, టీజేఎస్‌ శ్రేణు లు చేసిన కృషిని కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో టీజేఎస్‌ పాత్ర మరిచిపోలేనిదని గుర్తు చేశారు. ప్రజాపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలో కోదండ రాం సూచనలను నిత్యం పాటిస్తున్నట్టు చెప్పారు.

కోదండరాంను ఎమ్మెల్సీ చేసేందుకు చేసిన ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రపూరితంగా అడ్డుకుందని విమర్శించారు. టీజేఎస్‌ పార్టీకి ఇచ్చిన హామీ మేరకు త్వరలో ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక చాలా కీలకమని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి టీజేఎస్‌ మద్దతు ఇవ్వాలని కోరారు. టీజేఎస్‌ పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఒక డెడికేటెడ్‌ విద్యా కమిషన్‌ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఈ కాలంలో కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ విలువలను కాపాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందనీ, అందువల్ల కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడంలో టీజేఎస్‌ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.

ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మిత్రపక్షంగా టీజేఎస్‌ పార్టీకి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం కల్పించాలనీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల టీజేఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తీవ్రంగా కృషి చేయాలనీ, ఆ ప్రయత్నానికి టీజేఎస్‌ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విషయంలో టీజేఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం లో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ ప్రధాన కార్యదర్శులు గొప్పగాని శంకర్‌ రావు, పల్లె వినయ్, నిజ్జన రమేష్‌ ముదిరాజ్‌, ఆశప్ప, టీజేఎస్‌ నాయకులు మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, సర్దార్‌ జస్వంత్‌, బట్టల రామచందర్‌, కొత్త రవి, ప్రశాంత్‌, శేఖర్‌, హనుమంత్‌ రెడ్డి, ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -