Sunday, September 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసుప్రీంకోర్టు దృఢవైఖరితో 'సమాఖ్య'కు రక్ష

సుప్రీంకోర్టు దృఢవైఖరితో ‘సమాఖ్య’కు రక్ష

- Advertisement -

ఎంత ఉన్నత పదవిలో వున్నవారికైనా తాము రాజ్యాంగ పరంగా చెప్పవలసింది చెబుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.గవాయ్ ధర్మాసనం ప్రకటించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా స్వాగతించ దగినది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై అభిప్రాయం చెప్పడంలో అంతులేని జాప్యం చేస్తున్న గవర్నర్లపాత్రపై ఏప్రిల్‌8న ఇచ్చిన తీర్పును తాము తిరగదోడే ప్రసక్తి వుండబోదని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచనప్రాయంగా చెప్పేసింది. రాజ్యాంగ పరంగా ఏమి జరగాలనేది తాము సూచిస్తామే తప్ప గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై మళ్లీ జోక్యం చేసుకోబోమని సిజెఐ ఇంతకుముందే తేల్చేశారు. ప్రస్తుతానికి తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు తమకు న్యాయం చేస్తుందని ప్రత్యేకించి బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించడం సహజం, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులను అంతులేని జాప్యంతో అట్టి పెట్టుకోవడం స్టాలిన్‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారించింది.

తమ ముందుకు వచ్చిన బిల్లులపై మూడు మాసాల్లోగా ఆమోదం లేదా నిరాకరణ చేయవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్టే భావించాల్సి వుంటుందని కూడా నిర్దేశించింది. ఒకవేళ రాష్ట్రపతి పరిశీలనకు పంపేట్టయితే అప్పుడు కూడా మూడుమాసాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది, ఈతీర్పు తీవ్ర సంచలనం కలిగించింది. ఎందుకంటే కేంద్రంలో మోడీ అధికారం చేపట్టాక నియమితులైన గవర్నర్లు రాజును మించిన రాజభక్తుల్లా ఎన్‌డియేతర రాష్ట్ర సర్కార్లను అవస్త పెట్టడం, అడుగడుగునా గండాలు సృష్టించడం పరిపాటిగా మారింది.వైఎస్‌ ఛాన్సలర్ల నియామకం నుంచి బిల్లుల ఆమోదం, శాసనసభల్లో ప్రసంగ పాఠంతో సహా ప్రతిదీ వివాదం చేస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఈ అనిశ్చితిని ఆపడానికి దోహద పడుతుందనే హర్షామోదాలు వ్యక్తమైతే బీజేపీ అనుకూల పక్షాలూ, న్యాయవాద వర్గాలు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలిస్తుందని అభ్యంతరాలు లేవనెత్తాయి.

రాష్ట్రపతి లేఖ వెనక రాజకీయం
ఏప్రిల్‌ 8వ తేదీన తీర్పురాగా ఆ మరుసటి రోజునే కేంద్రం దానికి ఎలా విరుగుడు చేయాలని మంత నాలు ప్రారంభించింది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి,సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇంకా న్యాయశాఖ ప్రతినిధులతో విస్తారంగా చర్చలు సాగించారు. ఈ తీర్పుపై సమీక్ష కోరాలా లేక మరింత విస్తత ధర్మాసనం కోరాలా అని తర్జనభర్జనులు జరిపారు. రాజ్యాంగం 143(1) అధికరణం కింద రాష్ట్రపతి పేరిట సలహా కోరడమే ఉపయోగకరమని నిర్ణయానికి వచ్చారు. చివరకు మే ఏడవ తేదీ నాటికి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సమర్పించే ప్రశ్నావళి ప్రస్తావనను ఖరారు చేశారు. రాజ్యాంగం 200, అధికరణం గవర్నర్‌ పరిధిని చెప్తుంది 21వ అధికరణం శాసనసభ ఆమోదించిన బిల్లుల అంగీకారముద్ర గురించి చెప్తుంది. ఈ రెండు చోట్ల కూడా కాలపరిమితికి సంబంధించిన నిబంధనలేవీ లేనప్పుడు మూడు మాసాల్లోనే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఎలా చెప్తుందనేది ఈప్రశ్నల సారాంశం.

ఈ విధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరడం గతంలోనూ జరిగింది గానీ ఆ సంద ర్భాలు వేరు. 1960లో కేంద్రం సి జాబితాలోని రాష్ట్రాల ప్రతిపత్తిపై సుప్రీం సూచనలు కోరింది కేంద్రం. పాకిస్తాన్‌తో ప్రాదేశిక భూభాగంపై ఒప్పందం చేసుకోవచ్చునన్న విషయం 1951లో సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది.1978లో ఎమర్జెన్సీ తర్వాత ఆ లైంగిక కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయవచ్చునా అన్న అంశంపై అభిప్రాయం కోరింది,1993లో పీవీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అయోధ్య సమస్యపై అభిప్రాయం కోరగా ‘మా పరిధిలోకి రాదని’ కోర్టు నిరాకరించింది. 2011లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం వుండగా 2 జి స్పెక్ట్రమ్‌ కేటాయింపులపై కూడా సుప్రీం తీర్పు తర్వాత వేలం ద్వారానే స్పెక్ట్రమ్‌ను విక్రయించాలా మరే మార్గం అనుసరించరాదా చెప్పాలని రాష్ట్రపతి అభిప్రాయం కోరారు. విచారణ తర్వాత సుప్రీం ధర్మాసనం అదొక్కటే పద్ధతి అని చెప్పలేమని బదులిచ్చింది. ఏమైనా రాజ్యాంగం 142 అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు మాత్రమే అందులోని అధికరణాలు, నిబంధనలకు చెల్లుబాటుపై తుది మాట చెప్పవలసి ఉంటుంది. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వభావం తీర్పు తర్వాత ఇది మరింత బలపడింది. కాకపోతే ప్రస్తుతం ద్రౌపదీ ముర్ము పంపిన ప్రస్తావన కేవలం రాజ్యాంగ నిబంధనల అనువర్తింపుకే కాక రాజకీయ సంఘర్షణకు కూడా దారితీసేలా వుందని పరిశీలకులు సందేహించారు. రాజ్యాంగ పరమైన అనిశ్చిత పరిస్థితికి కారణమ వుతున్న ఒక సుదీర్ఘ సమస్యపై న్యాయస్థానం స్పష్టమైన నిర్దేశం చేస్తే దాని అమలుకు చర్యలు తీసుకోవడానికి బదులు సాగదీత సంఘర్షణ ఎందుకని ప్రశ్నించారు.

ఆపేస్తే చచ్చిపోతుందా?
మే నెలలో రాష్ట్రపతి లేఖ తర్వాత సుప్రీంకోర్టు అభిప్రాయం చెప్పడం రాజ్యాంగ బాధ్యత. సిజెఐ గవారు, కాబోయే సిజె సూర్యకాంత్‌, విక్రమనాథ్‌, పిఎస్‌ నరసింహన్‌, అతుల్‌ ఎస్‌ చందూర్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ నెలలో వరుసగా పదిరోజుల పాటు విచారణ జరిపింది. ఈ క్రమంలో కేంద్రం తరపున వాదించిన సోలిజిటర్‌ జనరల్‌ మెహతా,అటార్నీ జనరల్‌ వెంకట రమణి బిల్లులు గవర్నర్లు ఆమోదించకపోతే అది చచ్చిపోయినట్టే భావించాలని వ్యాఖ్యానించారు. సభలో చర్చించి పంపిన బిల్లును పదవిని బట్టి ఒక వ్యక్తి ఆలస్యం చేసి పక్కన పడేస్తే ఎలా చచ్చిపోతుందని న్యాయ మూర్తులు ప్రశ్నించారు.రాజ్యాంగపరంగా నియమితులైన వారికి కోర్టు ఎలా గడువు విధిస్తుందని పదే పదే అడ్డు సవాళ్లు విసిరారు. తామ గడువు విధించడం లేదనీ, ఒక కాలక్రమణిక మాత్రమే సూచించామని న్యాయమూర్తులు దీటుగా జవాబు చెప్పారు. నిర్దిష్టంగా ప్రతి బిల్లు ఇన్నే రోజుల్లో పూర్తిచేయాలని కాదు. అయితే గవర్నర్లు ఏ మాట చెప్పకుండా ఎంత కాలమైనా అట్టిపెట్టుకోవడం మాత్రం ఎలా చెల్లుతుంది? ప్రభుత్వాలు నిర్ణయించి చట్టసభలు చర్చించి ఒక బిల్లు ఆమోదిస్తే ఏ కారణం చెప్పకుండా ఎలాంటి గడువులేకుండా ఆలా పక్కనపడేసి అది చచ్చిపోయిందనుకోమంటే ఎలా చెల్లుతుంది? పనులు జరగాలంటే ఏదో ఒక వ్యవధి, గడువు అంటూ వుండాలి కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, గవర్నర్లు సుహృద్భావంతో కలసి మెలసి వ్యవహరి స్తారనుకున్నారు గనకే రాజ్యాంగ నిర్మాతలు గడువు పెట్టలేదనీ, కానీ రాష్ట్రాలు ఈ సమస్య తీసుకువచ్చాక రాజ్యాంగ స్ఫూర్తితో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు.

ఎంతటివారైతేనేం?
సిజెఐ గవారు ఇంకా సూటిగానే మాట్లాడారు. రాజ్యాంగంలో ఒక విభాగం తన బాధ్యతా నిర్వహణలో విఫలమైతే సుప్రీంకోర్టు అధికారం లేనట్టు నిస్సహాయంగా చూస్తూ కూచోవాలా? అని ప్రశ్నిస్తూ తాము అలా కూచోవడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు.రాజ్యాంగ సమస్యల వల్ల మన పక్కనే వున్న నేపాల్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నారు కదా అని కూడా గుర్తు చేశారు.అయితే గవర్నర్లు ఏదో అడ్డుపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం కేవలం రాజకీయ ప్రేరతమనీ,1970 నుంచి ఇప్పటి వరకూ చూస్తే గవర్నర్లు 90 శాతం బిల్లులకు ఆమోదం తెలిపారనీ కేవలం పది శాతం మాత్రమే అట్టిపెట్టుకున్నారని తుషార్‌ మెహతా వితండ వాదన చేశారు. పది లేదా ఒకటి ఆపేశారన్న సంఖ్య ఎంత అనేది తమకు ముఖ్యం కాదని అసలు ఏ కారణం చెప్పకుండా, ఏ సమయం ప్రకటించకుండా అలా అట్టిపెట్టేసుకుంటే ఏం చేయలేమా? అని మాత్రమే ఆలోచించామన్నారు. ఇక్కడ ఇంకో కిటుకువుంది. అన్ని విషయాల్లోనూ మోడీ వచ్చాకే చరిత్ర ప్రారంభమైనట్టు మాట్లాడే బీజేపీ నేతలు ఈ బిల్లుల ఆమోదంలో మాత్రం 1970 నుంచి లెక్కవేయడం ఆశ్చర్యకరం. వాయిదా పడిన వాటిలో అధికభాగం మోడీ హయాంలోనే అన్నది అసలు సంగతి. తమిళనాడులోనే పది పక్కనపెట్టేస్తే ఏమనాలి? తమిళనాడు విషయంలో ఇచ్చిన తీర్పు తమ గవర్నర్‌కూ వర్తింపచేయాలని కేరళ కోరుతున్నది. నిస్సందేహంగా ఇదొక రాజకీయ సంఘర్షణే. ఏప్రిల్‌లో ఇచ్చిన మూడు నెలల సమయం తీర్పు నిర్దేశించిన చట్టం సరిగా లేదు గనక రద్దు చేయాలని కేంద్రం తరపున ఎస్‌జి, ఎజిలు నేరుగా కోరారు గానీ న్యాయమూర్తులు అందుకు నిరాకరించారు.రాష్ట్రపతి అడిగినదానిపై అభిప్రాయం చెబుతామే గానీ గతంలో ఇచ్చిన తీర్పు జోలికి పోమని చెప్పేశారు. ఆ విధంగా ఇది సంచలనాత్మకమైంది.

చాలామంది వాదిస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏప్రిల్‌ తీర్పులో రాష్ట్రపతి లేదా గవర్నర్‌ ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆదేశించలేదు. తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవడానికి మూడు మాసాల వ్యవధి ఉండాలని మాత్రమే చెప్పింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని నొక్కి వక్కాణించడమే కానీ అందుకు భిన్నం కాదు. ఈ గడువు కూడా గతంలో ఇందిరాగాంధీ హయాంలో సర్కారియా కమిషన్‌, వాజపేయి హయాంలో పూజ కమిషన్‌లకు ఆధ్వర్యం వహించిన మాజీ న్యాయమూర్తులు చెప్పిందే. మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా హోంశాఖ విడుదల చేసిన సర్క్యులర్‌ ఇదే మూడు మాసాలలోగా ఆమోదించాలని చెప్పింది. గతంలో రెండు మూడు సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం ఇంతకంటే సూటిగా రాష్ట్రపతి విధివిధానాలపై నిర్దేశాలు ఇచ్చింది. 1994లో ఎస్‌ ఆర్‌ బొమ్మై కేసులో రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి ఏకపక్ష పోకడలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడానికి కూడా నిర్ణీత గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ తీర్పు తర్వాత అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శరవేగంగా నిర్ణయాలు తీసుకోవటం మనం చూసాం.

ఆశాభావం ఫలిస్తుందా?
ఈ ప్రస్తావన పంపడానికి ముందే అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్‌ కోర్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తితే కేంద్రం సంతోషించింది. కానీ తర్వాత ఆయన వాళ్లనే ఇబ్బంది పెట్టడంతో ఇంటికి పంపించి ఇప్పుడు సిపి రాధాకృష్ణన్‌ను తెచ్చింది. సీపీ పదహారవ యేటా నుంచి ఆరెస్సెస్‌తో అనుబంధం కలిగివున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గానేగాక ఇతరచోట్ల కూడా సేవలం దించారు. వాస్తవానికి మోడీ హయాంలో అనేక రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్లు అత్యుత్సాహంతో ప్రత్యక్ష రాజకీయ పాత్ర అపర సైంధవుల్లా బీజేపీయేతర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కేరళలోనూ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పంపిన వైస్‌ చాన్సలర్ల పేర్లను గవర్నర్‌ పక్కన పెట్టి తను నిర్ణయించిన వారినే నియమిస్తానని, ఇది పూర్తిగా తన నిర్ణయాధికారమేననీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎడతెగని ఈ అప్రజాస్వామిక వైఖరికి సుప్రీంకోర్టు నిర్దేశం స్వస్తి పలుకుతుందనే ఆశ సిజెఐ మాటలతో కలుగుతుంది. డిసెంబరు నెలలో పదవీ విరమణ చేయనున్న సిజెఐ గవారు తీర్పునివ్వాల్సిన కీలక కేసులు మరికొన్ని వుండగా గవర్నర్ల విషయం నేరుగా రాష్ట్రపతి పేరుతో తిరగదోడబడింది గనక ఏం చెబు తారనేది దేశమంతా ఎదురుచూస్తున్నది.ఆయన కూడా డిసెంబరు నెలలో పదవీ విరహణ చేశాక జస్టిస్‌ సూర్య కాంత్‌ బాధ్యతల చేపట్టి 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగుతారు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -