నవతెలంగాణ -హైదరాబాద్: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ వెంటనే పట్టుకుని షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆదేశాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది దశాబ్దాలుగా అనుసరిస్తున్న మానవతా, శాస్త్రీయ విధానాలకు తిరోగమనమని ఆయన మంగళవారం నాడు విమర్శించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఈ మూగజీవాలు తొలగించాల్సిన సమస్యలు కావు. అన్నింటినీ ఒకేసారి తరలించడం క్రూరమైన, అవివేకమైన చర్య. షెల్టర్లు, సంతాన నియంత్రణ (స్టెరిలైజేషన్), వ్యాక్సినేషన్, సామాజిక సంరక్షణ ద్వారా వీధులను సురక్షితంగా ఉంచవచ్చు. ప్రజల భద్రత, జంతు సంక్షేమం రెండూ సమాంతరంగా సాధ్యమే” అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ప్రజల భద్రత, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పరిస్థితి తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. షెల్టర్లు లేనిచోట తక్షణమే నిర్మించి, 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కుక్కల తరలింపును అడ్డుకునే సంస్థలు లేదా వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జంతు హక్కుల కార్యకర్తలు, జంతు ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగిన పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తీర్పు దిగ్భ్రాంతికరమని, జంతు జనన నియంత్రణ (2003) చట్టానికి విరుద్ధమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO), పెటా (PETA) వంటి సంస్థలు ఆరోపించాయి. కుక్కలను వాటి ప్రాంతాల నుంచి తరలిస్తే, ఆ ప్రదేశంలోకి వ్యాక్సిన్లు వేయని కొత్త కుక్కలు వచ్చి చేరతాయని, దీనివల్ల సమస్య మరింత పెరుగుతుందని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ తీర్పుపై నివాస సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.