న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో విద్యార్ధి కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక కుట్ర వుందంటూ యుఎపిఎ కింద నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వారు సుప్రీంలో సవాలు చేశారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన బెంచ్ ఈ విచారణను చేపట్టనుంది. సహ నిందితుడు మీరన్ హైదర్ పెట్టుకున్న పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి గవారు, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్ ముందు విచారణ జరగనుంది. ఢిల్లీ అల్లర్లు సాధారణంగా జరిగే నిరసనలు కావని, ముందస్తు ప్రణాళిక ప్రకారం, కుట్రతో పన్నినవని విమర్శిస్తూ ఈ కేసులోని 9మంది నిందితుల బెయిల్ పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసులో నిందితులు 2020 నుండి అండర్‌ట్రయల్స్‌గా మగ్గుతున్నారు. విచారణలో అసాధారణ జాప్యం జరిగిందని, పైగా సహ నిందితుడికి ఇప్పటికే బెయిల్ వచ్చిందని పేర్కొంటూ వీరికి కూడా బెయిల్ ఇవ్వాలని వారి తరపు న్యాయవాదులు 2020 నుండీ కోరుతున్నారు.