ప్రభుత్వ ప్లీడర్లను తొలగిస్తూ తెచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఈ అంశం నమ్మకంతో కూడుకుంది
వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం
పని చేసిన కాలానికి గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ప్రభుత్వ ప్లీడర్ల (జీపీ) తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆర్టీ 354 ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రభుత్వానికి, న్యాయవాదులకు మధ్య ఉన్న ‘విశ్వాసం లేదా నమ్మకం'(ఫెడిలిటీ లేదా ట్రస్ట్) పై ఆధారపడి ఈ పోస్ట్‌ల భర్తీ ఉంటుందని వ్యాఖ్యానించింది. వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో న్యాయాధికారుల తొలగింపు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే, వారు పనిచేసిన కాలానికి రావాల్సిన గౌరవ వేతనబకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా న్యాయస్థానాల్లో గవర్నమెంట్ ప్లీడర్లు, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్లును నియమించింది.
ఈ నియామక ప్రక్రియ సరిగా జరగలేదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తొలగిస్తూ జీవో 354ను తీసుకువచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా, తొలుత సింగిల్ బెంచ్, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వును సమర్థించాయి. ‘ప్రభుత్వాలు తమకు నచ్చిన న్యాయాధికారులను నియమించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ అంశంలో కలగజేసుకోవడం పరిపాలనలో జోక్యం చేసుకోవడం అంటే ప్రభుత్వ నిర్ణయాలకు సంకెళ్లు వేయడమేనని. న్యాయాధికారుల కొనసాగింపు ప్రక్రియ ప్రభుత్వ విశ్వాసానికి సంబంధించిన అంశం’ అని పేర్కొంటూ తీర్పును వెలువరించాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న యాండాల ప్రదీప్‌తో పాటు మరో 19మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై సోమవారం జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ మెహిత్ రావు, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ఎల్ నర్సింహా రెడ్డి, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ దేవిన సెఘల్(ఏఓఆర్), అడ్వొకేట్ శ్రీకాంత్ హాజరయ్యారు.
న్యాయవాదులు ఆరాటపడకూడదు…
తొలుత పిటిషనర్ల తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ… ప్లీడర్ల తొలగింపు నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. అందువల్ల ప్రభుత్వం తెచ్చిన జీవో 354 ను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ వాదనలను ధర్మాసనం తొసిపుచ్చింది. జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి స్పందిస్తూ…. ‘నేను గతంలో రెండు కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితుడినయ్యా. వాటికి నేను రాజీనామా చేసిన తర్వాత కేసు టూ కేసు అడ్వకేట్‌గా కేసులు అప్పగించారు. ఆ తర్వాత నేను న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టా. అయితే మార్కెటింగ్ కమిటీ బోర్డుకు సంబంధించిన నామినేటెడ్ పోస్ట్‌లకు విషయంలో… నేను జస్టిస్ బోస్లేతో కలిసి తీర్పు వెలువరించాం. సెలెక్షన్, ఎలక్షన్, నామినేషన్లుగా అవి జరిగాయి. పంజాబ్-హర్యానా హైకోర్టు ఐదుగురు జడ్జీ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఇది సాధ్యమైంది’ అని వివరించారు. అయితే… న్యాయవాదులు ఇలాంటి పదవుల కోసం ఆరాటపడకూడదని, ఇది క్లయింట్ (ప్రభుత్వం) ఇచ్చే నమ్మకానికి, విశ్వసనీయతకు సంబంధించిన విషయమన్నారు. ‘ప్రభుత్వ ప్లీడర్ల పదవులు అత్యంత సున్నితమైనవి, గోప్యమైనవి. ప్రభుత్వానికి తమ న్యాయవాదులపై పూర్తి విశ్వాసం ఉండాలి. గత ప్రభుత్వంలో నియమితులైన వారిపై ప్రస్తుత ప్రభుత్వానికి నమ్మకం లేనప్పుడు.. ముఖ్యమైన, సున్నితమైన కేసులను ఎలా అప్పగిస్తుంది?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ లాయర్ల నియామకం, తొలగింపునకు సంబంధించి ప్రభుత్వానికి విస్తత అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. మధ్యలో పిటిషనర్ల తరపు అడ్వకేట్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా… ధర్మాసనం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు.
రెండు నెలల్లో గౌరవ వేతనాలు చెల్లించండీ…
తొలగించిన లాయర్లు వారికి రావాల్సిన గౌరవ వేతనంపై ఆధారపడి జీవిస్తున్నారని పిటిషనర్ల తరపు అడ్వకేట్ ధర్మాసనానికి నివేదించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దష్టికి తెచ్చారు. అయితే ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం… ‘తొలగింపు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోనప్పటికీ, లాయర్లు పనిచేసిన కాలానికి సంబంధించిన పూర్తి బకాయిలను చెల్లించాల్సిందే. తొలగింపునకు గురైన న్యాయవాదులు, వారికి రావలసిన బకాయిల వివరాలతో నెల రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాలి. జిల్లా కలెక్టర్ ఆ వివరాలను ధ్రువీకరించుకుని, ప్రభుత్వ న్యాయశాఖకు నివేదిక పంపాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. వినతిపత్రం అందిన నాటి నుంచి రెండు నెలల్లోగా ప్రభుత్వం వారికి రావాల్సిన పూర్తి బకాయిలను చెల్లించాలని ఆదేశించింది.
జీవో 354ను సమర్థించిన సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -