నవతెలంగాణ హైదరాబాద్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. తనకు కూడా వామపక్ష భావజాలం పట్ల అభిమానం ఉందని పేర్కొన్నారు. సురవరం ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు.
నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేశారు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
తాను ఎన్ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పుడు తొలిసారి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసినట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో మళ్లీ కలిశానని చెప్పారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు. సురవరం నిబద్ధతతో రాజకీయాలు నడిపారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు.