– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై నిఘా పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులు కూడా అవసరానికి మించి యూరియాను కొనొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో యూరియా కొరతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, హకా ఎమ్‌డీ చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ఎమ్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ ఎమ్‌డీ కె.రాములుతోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా పరిస్థితులపై డైరెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందని తెలిపారు. దిగుమతుల ద్వారా సరఫరా కావాల్సిన యూరియా కోటాలో కొన్ని నెలల్లో కంపెనీలు అసలు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండానే బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. వానాకాలం సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడంతో యూరియా కొరత ఉందన్నారు. యూరియాను వ్యవసాయానికి కాకుండా, ఇతర అవసరాల కోసం మళ్లించకుండా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
యూరియా అమ్మకాలపై నిఘా పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES