Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంతాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి !

తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి !

- Advertisement -

మాజీ చీఫ్‌ జస్టిస్‌ను ప్రతిపాదించిన జెన్‌ జడ్‌
నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
సైనిక పహారాలో ఖాట్మండు
నెమ్మదిగా సాధారణ పరిస్థితుల్లోకి 30కి చేరిన మృతులు

ఖాట్మండు : రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు, హింసతో దద్దరిల్లిన నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెమ్మదిగా నెలకొంటున్నాయి. దేశ భద్రతా వ్యవహా రాలు చేపట్టిన నేపాల్‌ ఆర్మీ, రాజధాని ఖాట్మండు వ్యాప్తంగా సైనిక బలగాలను మోహరిం చింది. దేశవ్యాప్తంగా ఆంక్షలను విధించింది. సాయుధ వాహనాలు నిరంతరంగా రోడ్లపై తిరుగుతూ పహరా కాస్తున్నాయి. కర్ఫ్యూ అమల్లో వుండడంతో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్‌, సుప్రీంకోర్టు సహా కీలక భవనాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంయమనం పాటిస్తూ, విధ్వంసానికి దూరంగా వుండాల్సిందిగా ప్రజలను ఆర్మీ కోరింది. గురువారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో వుండేలా ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని సైనిక ప్రతినిధి రాజా రామ్‌ బాస్నెట్‌ తెలిపారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలన్నదే తమ లక్ష్యమన్నారు.

తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి
నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీలా కర్కి (73) ని తాత్కాలిక ప్రధానిగా చేయాలని జెన్‌ జడ్‌ యువత ప్రతిపాదించింది. ఈ మేరకు వారికి సంబంధించిన ఒక గ్రూపు ప్రకటన చేసింది. ఈ బృందం నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ను కలిసి తమ ప్రతిపాదన గురించి తెలియచేస్తారని నేపాల్‌ సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, న్యాయవాది రామన్‌ కుమార్‌ కర్ణ మీడియాకు చెప్పారు.

ఎవరీ సుశీలా కర్కి ?
నిరసనలు చేపట్టిన యువతరానికి, వారు ప్రతిపాదించిన తాత్కాలిక నేతకు వయస్సు అంతరం అపారంగా వుంది. అయితే తీవ్రమైన అవినీతి, అనైతికతల్లో కూరుకుపోయిన పాలక వర్గం పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో సుశీలా కర్కి రాజకీయాలకతీతమైన వ్యక్తి కావడమే ఆమెకు సానుకూలమైన అంశంగా మారింది. ఆమె భర్త దుర్గాప్రసాద్‌ సుబేది నేపాలీ కాంగ్రెస్‌లో యువజన విభాగ నేతగా వున్నారు. కానీ ఆమె మాత్రం రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు నెరపడం లేదు. లాయర్‌గా, ప్రాంతీయ న్యాయమూర్తిగా చివరకు నేపాల్‌ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ స్థాయికి ఆమె క్రమంగా ఎదుగుతూ వచ్చారు. ఈ హిమాలయ రాజ్యంలో 8ఏళ్ళ క్రితం ఈ అత్యున్నత పదవిని అధిరోహించిన ఏకైక మహిళ ఆమె కావడం విశేషం. నేపాల్‌కు ఇంతవరకు ఎన్నడూ మహిళా ప్రధాని లేరు. కానీ గతంలో నేపాల్‌ అధ్యక్ష పదవిని వైద్య దేవి భండారీ నిర్వహించారు. చీఫ్‌ జస్టిస్‌ స్థాయికి ఆమె పదోన్నతికి ఒకప్పుడు ఆమోద ముద్ర వేసిన కె.పి.శర్మ ఓలికి వారసురాలిగా ఇప్పుడు కర్కి ప్రధాని పదవిని అధిష్టించనున్నారు.

జీవన ప్రస్థానం : 1952 జూన్‌ 7న విరాట్‌నగర్‌లో సుశీలా కర్కి జన్మించారు. ఏడుగురి పిల్లలో పెద్దదైన సుశీల 1979లో తన లీగల్‌ కెరీర్‌ను ఆరంభించారు. 2007లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. 2009 జనవరిలో సుప్రీం కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన ఆమె 2010లో శాశ్వత న్యాయమూర్తిగా మారారు. 2016 నుండి ఏడాదిపాటు దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు.

30కి చేరిన మృతులు
కాగా నేపాల్‌ హింసలో మరణించినవారి సంఖ్య 30కి చేరింది. గాయపడిన 1033మంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఖాట్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పునరుద్ధ రించారు. అసాధారణ పరిస్థితుల కారణంగా గత రెండు రోజులు నిలిచిపోయిన విమానాల రాక పోకలను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బీభత్సంగా రోడ్లు
పార్లమెంట్‌ భవనం వున్న సమీప ప్రాంతాల్లో తగలబెట్టిన వాహనాలు, వంకర్లు పోయిన లోహపు సామాన్లు చెల్లాచెదురుగా వీధుల్లో పడివున్నాయి. మంగళవారం ఆందోళనకారులు నిప్పంటించడంతో పార్లమెంట్‌ భవనం బయట అంతా నల్లగా మసి పట్టిపోయి కనిపిస్తోంది. కాగా రోడ్లపై పడిన శిధిలాలను తొలగించడానికి కొంతమంది పనిచేయడం కనిపిస్తోంది.

భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు
నేపాల్‌లో చిక్కుకుపోయి సహాయం కోసం ఆర్ధించిన భారతీయులందరినీ వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి సంబంధిత వర్గాలతో చర్చలు జరుగుతున్నాయి. వందలాదిమంది కైలాస్‌ మానససరోవర్‌ యాత్రికులు టిబెట్‌లో చిక్కుకుపోయారు. తాము వెనక్కి తిరిగి రావడానికి సాయమందించాల్సిందిగా విదేశాంగ శాఖను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad