Monday, November 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా చేరిన సిరియా అధ్యక్షుడు

అమెరికా చేరిన సిరియా అధ్యక్షుడు

- Advertisement -

నేడు ట్రంప్‌తో భేటీ
వాషింగ్టన్‌ :
చారిత్రక అధికార పర్యటన నిమిత్తం సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా శనివారం అమెరికా చేరుకున్నారు. 1946లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సిరియా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. షరా పర్యటనకు ముందే ఆయనను ‘ఉగ్రవాదుల జాబితా’ నుంచి అమెరికా తొలగించింది. షరా నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు గత సంవత్సరం దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌-అసాద్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. షరా తన పర్యటనలో భాగంగా నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమవుతారు. మేలో ప్రాంతీయ పర్యటనకు వచ్చిన ట్రంప్‌ను రియాద్‌లో షరా కలుసుకున్నారు. ఇస్లామిక్‌ దేశాలకు (ఐఎస్‌) వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో ఏర్పడిన కూటమిలో చేరేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై షరా సంతకం చేస్తారని సిరియాలో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న టామ్‌ బారక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియా, ఇజ్రాయిల్‌ మధ్య మానవతా సాయాన్ని సమన్వయం చేసేందుకు, పరిణామాలను నిశితంగా పరిశీలించేందుకు డెమాస్కస్‌ సమీపంలో సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. కాగా తమ అవసరాలను షరా తీర్చినందున ఆయనను బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించామని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ పిగాట్‌ ధృవీకరించారు. జాడ తెలియకుండా పోయిన అమెరికన్ల ఆచూకీ తెలుసుకునేందుకు, తన వద్ద మిగిలి ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేసేందుకు కూడా షరా అంగీకరించారు. గత నెలలో షరా ఐక్యరాజ్యసమితిని సందర్శించారు. దశాబ్దాల కాలంలో ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి సిరియా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఆ పర్యటనకు ముందే ఆయనపై ఉన్న ఆంక్షలను భద్రతా మండలి ఎత్తివేసింది. సిరియాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షరాతో పాటు నూతన ప్రభుత్వం కూడా ఉగ్రవాద చర్యలకు దూరంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -