టీమిండియా జెర్సీ ఆవిష్కరణ
రాయ్ పూర్: టి20 ప్రపంచకప్ టీమిండియా జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బుధవారం ఆవిష్కరించింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మాజీ కెప్టెన్, ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మకొత్త జెర్సీని ఆవిష్కరించారు. టీమిండియా రైజింగ్ స్టార్ తిలక్ వర్మ, బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. రాయ్ పూర్‌కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఆడబోయే..’ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2007లో తొలి ప్రపంచకప్ గెలిచాం. మళ్లీ కప్‌ను సాధించేందుకు 15 సంవత్సరాలకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. జట్టు కప్‌ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్ అన్నాడు. ఈ జెర్సీలో భారత్ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువగా ముదురు నీలం రంగులో ఉండగా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగులో స్ట్రిప్స్ ఉంటుంది. కాలర్ దగ్గరలో తెలుపు రంగు ఉంది. జెర్సీ మధ్యలో టీమిండియా స్పాన్సర్ అపోలో టైర్స్, ఇండియా పేరు కనిపించేలా బిసిసిఐ జెర్సీని తీర్చిదిద్దింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టి20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసిసి గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే.



