నవతెలంగాణ-హైదరాబాద్ : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయినవిల్లి తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై అదే మండలం తొత్తరమూడి శివారు జోగిరాజుపాలేనికి చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో దాడిచేసి గాయపరిచాడు. ఆమె చేతికి గాయమైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సత్యనారాయణ చేతిసంచిలో కొడవలి పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్ పైకి విసరడంతో ఆమె చేతికి గాయమైంది. వెంటనే తేరుకున్న సిబ్బంది అతడిని బయటకు లాక్కువచ్చారు. అతడు మద్యం తాగి ఉన్నాడని తెలిపారు. తనకు తొత్తరమూడిలో కొబ్బరితోటలు ఉన్నాయని, వాటిని ఇతరులు ఆక్రమించుకున్నారని, భూపత్రాలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతుంటాడని స్థానికులు తెలిపారు. కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తుంటాడన్నారు. గతంలో ఓ నేర సంఘటనలోనూ జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు, భూసంబంధిత సమస్యలు లేవని తహసీల్దార్ నాగలక్ష్మమ్మ తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిందితుడిని అరెస్టు చేశారు. తహసీల్దార్‌ను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరామర్శించారు.
తహసీల్దార్‌పై మారణాయుధంతో దాడిచేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. తహసీల్దార్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేయాలని ఎస్పీకి సూచించారు.
తహసీల్దార్‌పై కొడవలితో దాడి
- Advertisement -
- Advertisement -