Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి రైతుల కష్టాలు పట్టించుకోండి

పత్తి రైతుల కష్టాలు పట్టించుకోండి

- Advertisement -

మొద్దు నిద్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పట్టించుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆరు గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌, కేంద్రంలోని బీజేపీ పార్టీల ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ అంశంలో మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తేమశాతం, కపాస్‌ మొబైల్‌ యాప్‌ రిజిస్ట్రేషన్‌, జిన్నింగ్‌ మిల్లుల అవినీతి, మిల్లుల గ్రేడింగ్‌ అంటూ కుంటి సాకులతో సీసీఐ కొనుగోళ్లను నిరాకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందనీ, ఈ సీజన్‌లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత తక్కువని పేర్కొన్నారు.

రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర ఉండగా, సీసీఐ కొనుగోళ్ల లేక రైతులు అడ్డగోలు ధరకు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు కూడా దక్కడం లేదని గుర్తు చేశారు. దీని వల్ల ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ. 2,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ కొర్రీలకు తోడు జిన్నింగ్‌ మిల్లులు సమ్మె చేస్తే పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -