యంగ్ ప్రెసిడెంట్‌గా మాజీ కెప్టెన్ రికార్డు
ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్నికల అవకతవకలపై నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక, సిఫారసుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తమీమ్ ఇక్బాల్‌ను కొత్త ప్రెసిడెంట్‌గా నియమించింది. 37 ఏండ్ల తమీమ్ ఇక్బాల్ బంగ్లా క్రికెట్ బోర్డు పగ్గాలు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. 11 మందితో కూడిన తాత్కాలిక కమిటీకి ఇక్బాల్ నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యుల్లో మాజీ కెప్టెన్ మిన్హాజుల్ అబెడిన్, మాజీ క్రికెటర్ అథర్ అలీ ఖాన్ సైతం ఉన్నారు. రాష్మ ఇమామ్, మీర్జా అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఖస్రు, తంజిల్ చౌదరి, సల్మాన్ ఇఫాని, రఫీకుల్ ఇస్లామ్, ఫహీమ్ సిన్హాలు కమిటీలో ఉన్నారు. ఎన్నికల అవకతవకల ఆరోపణలపై విచారణ చేపట్టిన దర్యాప్తు కమిటీ.. దర్యాప్తు వివరాలను, సిఫారసులను క్రీడా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. ‘ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాయి. అక్రమంగా ఎన్నికైన క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నాం. ఆ స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సమాచారం ఐసీసీకి తెలియజేశామని’ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ డైరెక్టర్ మహ్మద్ అమీనుల్ అహెసన్ తెలిపారు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 391 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లు) ఆడాడు. 38 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించిన తమీమ్ బంగ్లాదేశ్‌కు 21 విజయాలు అందించాడు. 2022లో దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ విజయం తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీ కెరీర్‌కు హైలైట్. 2025లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడాడు. నిరుడు బీపీఎల్‌లో ఆడుతుండగా గుండెపోటు రావటంతో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ చీఫ్‌గా తమీమ్ ఇక్బాల్
- Advertisement -
- Advertisement -



