Saturday, October 18, 2025
E-PAPER
Homeఆటలుతన్వీశర్మ నవ చరిత్ర

తన్వీశర్మ నవ చరిత్ర

- Advertisement -

క్వార్టర్స్‌ విజయంతో పతకం ఖాయం
ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌

గువహటి : బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ (16) చరిత్ర సృష్టించింది. 2008 తర్వాత ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ సింగిల్స్‌ విభాగంలో పతకం సాధించనున్న తొలి షట్లర్‌గా తన్వీ శర్మ నిలువనుంది. గువహటిలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ తన్వీ శర్మ 13-15, 15-9, 15-10తో సకి మట్సుమోటోపై మెరుపు విజయం సాధించింది. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తన్వీ శర్మ తొలి గేమ్‌లో తడబాటుకు గురైంది. జపాన్‌ అమ్మాయి సకి 15-13తో తన్వీ శర్మకు షాక్‌ ఇచ్చింది. కానీ వేగంగా పుంజుకున్న తన్వీ శర్మ సూపర్‌ ర్యాలీలకు తోడు మెరుపు వేగంతో స్మాష్‌లు సంధించింది. నెట్‌ దగ్గర సకిని తికమక పెట్టి వరుస సెట్లలో స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. నేడు సెమీఫైనల్లో చైనా షట్లర్‌ షి య లియుతో తన్వీ శర్మ పోటీపడనుంది. 2008 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు భారత్‌కు చారిత్రక పతకం అందించిన సంగతి తెలిసిందే.

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జ్ఞానదత్తు పరాజయం పాలయ్యాడు. చైనా షట్లర్‌ లియు యాంగ్‌ యు చేతిలో 11-15, 13-15తో జ్ఞానదత్తు ఓటమి చెందాడు. వరుస సెట్లలో నిరాశపరిచిన జ్ఞానదత్తు పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో భార్గవ్‌ రామ్‌, విశ్వతేజ్‌లు 12-15, 10-15తో నాల్గో సీడ్‌ చైనా షట్లర్ల చేతిలో వరుస గేముల్లో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో పతక ఫేవరేట్‌, ఎనిమిదో సీడ్‌ ఉన్నతి హుడా నిరాశపరిచింది. థారులాండ్‌ అమ్మాయి, రెండో సీడ్‌ అన్యపత్‌తో క్వార్టర్స్‌ పోరులో 12-15, 13-15తో ఉన్నతి హుడా పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో భవ్య, విశాఖ జోడీ 9-15, 7-15తో వరుస గేముల్లో భంగపాటుకు గురైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -