నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్‌ల విధానాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. టారిఫ్‌ల ద్వారా తమ దేశానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సమకూరిందని, త్వరలోనే మరిన్ని నిధులు రానున్నాయని ప్రకటించారు. ఈ విధానం వల్ల దేశం ఆర్థికంగానే కాకుండా, జాతీయ భద్రత పరంగా కూడా ఎంతో బలపడిందని ఆయన అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు.
“టారిఫ్‌ల ద్వారా మాకు 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ, ఫేక్ న్యూస్ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. సుప్రీంకోర్టులో టారిఫ్‌లపై రాబోయే కీలక తీర్పును ప్రభావితం చేయడానికే ఇలా చేస్తున్నారు” అని ఆరోపించారు. టారిఫ్‌ల వల్లే అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్, విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రత, విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై కూడా 50 శాతం టారిఫ్‌లు విధించారు.



