– టాప్ సీడ్ లీపై మెరుపు విజయం
– క్వార్టర్స్‌లో లక్ష్య, సాత్విక్ జోడీ
– మకావు ఓపెన్ బ్యాడ్మింటన్
మకావు (చైనా) : ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ మిశ్రమ ఫలితాలు చూస్తోంది. అగ్రశ్రేణి షట్లర్లు సహా వర్థమాన షట్లర్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లపై విజయాలు సాధిస్తున్నా.. నిలకడ కనిపించటం లేదు. చైనా ఓపెన్ తొలి రౌండ్లో సింధు, ప్రణరు, ఉన్నతి మెగా విజయాలు నమోదు చేసినా, ఆ తర్వాత తేలిపోయారు. తాజాగా మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో యువ షట్లర్ తరుణ్ మానెపల్లి మెరుపు ప్రదర్శన చేశాడు. టాప్ సీడ్, వరల్డ్ నం.15 లీ యు (హాంగ్‌కాంగ్)పై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందాడు. 60 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 19-21, 21-14, 22-20తో తరుణ్ అదరగొట్టాడు. తొలి గేమ్‌లో ఆఖరు వరకు పోరాడిన తరుణ్.. వరుసగా రెండు గేముల్లో పైచేయి సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను టైబ్రేకర్‌లో సాధించి పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. రెండో సీడ్, వరల్డ్ నం.17 లక్ష్యసేన్ సైతం మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇండోనేషియా షట్లర్ చికో ఆరాపై 21-14, 14-21, 21-17తో లక్ష్యసేన్ విజయం సాధించాడు. 67 నిమిషాల్లోనే అన్‌సీడెడ్ షట్లర్‌ను ఓడించిన లక్ష్యసేన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. రెండో సీడ్ సాత్విక్, చిరాగ్‌లు 10-21తో తొలి గేమ్‌లో తేలిపోయారు. కానీ వరుస గేముల్లో 22-20, 21-16తో సత్తా చాటారు. కీలక రెండో గేమ్‌ను టైబ్రేకర్‌లో నిలుకున్న సాత్విక్, చిరాగ్‌లు నిర్ణయాత్మక గేమ్‌లో అద్భుతంగా ఆడారు.
మెన్స్ సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 18-21, 16-21తో మలేషియా ఆటగాడు జస్టిన్ చేతిలో ఓటమి చెందాడు. 48 నిమిషాల్లోనే చేతులెత్తేసిన ఆయుష్ శెట్టి.. మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టో జంట మలేషియా షట్లర్లతో 55 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-19, 13-21, 18-21తో పోరాడి ఓడింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో రక్షిత శ్రీ 21-14, 10-21, 11-21తో రెండో సీడ్ బుసానన్ (థారులాండ్) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో 21-14తో సత్తా చాటిన రక్షిత.. ఆ తర్వాత బుసానన్ దూకుడు ముంగిట చేతులెత్తేసింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి, సాయి ప్రతీక్ జోడీ 18-21, 18-21తో వరుస గేముల్లో నాల్గో సీడ్ మలేషియా స్టార్స్ చేతిలో ఓటమిపాలయ్యారు. మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి జోడీ 14-21, 12-21తో ఎనిమిదో సీడ్ ఇండోనేషియా అమ్మాయిల చేతిలో తలొంచింది.
తరుణ్ తఢాకా
- Advertisement -
- Advertisement -