– అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్
– తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై 11 శాతం పన్ను రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో పత్తిపై దిగుమతి పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సారా సురేష్ మాట్లాడుతూ… భారత వాణిజ్య విధాన రూపకల్పన సందర్భంగా ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రైతు, మత్స్య కార్మికుల, పశు పెంపకం దారుల హక్కులను కాపాడతానని, రాజీ పడబోనని గోడగా నిలబడతానని తను ఉపన్యాసంలో రైతులకు భరోసా కల్పించాడన్నారు.
కానీ నాలుగు రోజులకి ఆగస్టు 9న 11 శాతం ఉన్న పత్తి దిగుమతి పై సుంకం రద్దు చేసి, మోడీ రైతు వ్యతిరేక స్వభావాన్ని, అమెరికా, బ్రిటన్ కార్పొరేట్ వ్యాపారుల సేవకుడిగా చాటుకున్నాడని విమర్శించారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పత్తి రైతులే ఎక్కువ శాతం ఉన్నారనే సంగతి కేంద్రంలోని పాలకులకు తెలియదా? అని ప్రశ్నించారు. 2025 సంవత్సరంలో మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో మూడు నెలల్లోనే 767 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దిగుమతి, ఎగుమతి మూలంగా పత్తి ఉత్పత్తి 10 లక్షల టన్నుల వరకు పడిపోయిందన్నారు.
దేశంలో 60 లక్షల మంది పత్తి సాగు చేసే కుటుంబాలు తిరువూరు నష్టాలకు గురవుతున్నారని, తద్వారా పత్తి రైతుల ఆత్మహత్యలకు పెరిగేందుకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పత్తి దిగుమతి పై 11 శాతం సుంకాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.కిషన్, ఉపాధ్యక్షులు బషీర్ అశోక్, టియుసిఐ జిల్లా నాయకురాలు సత్తెమ్మ, మండల నాయకులు పి.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.