నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి, తరగతి గదిలోనే నిద్రపోయిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఆ టీచర్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లాలోని జైనూర్ మండలం సుకుత్ పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (ఏహెచ్ఎస్) ఎస్జీటీగా జే. విలాస్ పనిచేస్తున్నారు. అయితే, ఆయన ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యారు.
మద్యం మత్తులో తరగతి గదిలోనే నిద్రలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల నుంచి అందిన ఫిర్యాదుపై అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఉపాధ్యాయుడు విలాస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.