– 6న స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌ఆప్షన్ల నమోదు
– 7న జీహెచ్‌ఎం ప్రమోషన్ల ఉత్తర్వులు
– 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. పది రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్‌ఎం) గ్రేడ్-2, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు పదోన్నతుల ప్రక్రియను చేపడతామని వివరించారు. శనివారం జీహెచ్‌ఎం, ఎస్‌ఏ పోస్టుల ఖాళీల వివరాలతోపాటు ఎస్‌ఏ, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)ల సీనియార్టీ జాబితాను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించి స్కూల్ అసిస్టెంట్ తుది సీనియార్టీ జాబితాను ప్రకటిస్తామని వివరించారు. ఈనెల ఆరున జీహెచ్‌ఎం గ్రేడ్-2 పోస్టులకు పదోన్నతుల కోసం అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని కోరారు. అదేనెల ఏడో తేదీన ఆర్జేడీలు జీహెచ్‌ఎం పదోన్నతుల ఉత్తర్వులను విడుదల చేస్తారని తెలిపారు. ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన క్యాడర్ పోస్టుల ఖాళీలను ప్రకటిస్తామని వివరించారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎస్జీటీల సీనియార్టీ జాబితాను ప్రకటిస్తామనీ, వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఎస్జీటీల తుది సీనియార్టీ జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈనెల పదో తేదీన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోసం ఎస్జీటీలు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. అదేనెల 11న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను కల్పిస్తూ డీఈవోలు ఉత్తర్వులను జారీ చేస్తారని వివరించారు.
3,580 ఉపాధ్యాయులకు పదోన్నతులు!
రాష్ట్రంలో 3,580 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశమున్నది. రాష్ట్రంలో 900 జీహెచ్‌ఎం గ్రేడ్-2 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. జీహెచ్‌ఎం పోస్టులను వందశాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. దీంతో 900 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్‌ఎం పదోన్నతులు లభిస్తాయి. దీంతో 900 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అవుతాయి. అందులో 70 శాతం పోస్టులు పదోన్నతుల ద్వారా, మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో 900 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం అంటే 630 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ అవుతాయి. మిగిలిన 30 శాతం అంటే 270 పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో రెండు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులోనూ 70 శాతం పోస్టులే పదోన్నతుల ద్వారా భర్తీ అవుతాయి. అంటే 1,400 మంది ఎస్జీటీలకే పదోన్నతుల వస్తాయి. మిగిలిన 30 శాతం పోస్టులు అంటే 600 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 2,030 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్జీటీలకు పదోన్నతులు లభిస్తాయి. రాష్ట్రంలో 650 వరకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వంద శాతం ఎస్జీటీల ద్వారా భర్తీ చేస్తారు. ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పదోన్నతి పొందాలంటే ఇంటర్, డీఎడ్ చదివిన ఉపాధ్యాయులే అర్హులు. బీఈడీ పూర్తి చేసిన వారికి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పదోన్నతి పొందే అవకాశం లేదు.
ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీల భర్తీ ఎట్లా?
రాష్ట్రంలో జీహెచ్‌ఎం ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులను కల్పించి భర్తీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ఎస్జీటీలకు పదోన్నతులను కల్పిస్తున్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో జీహెచ్‌ఎంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. దీంతో విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా ఉంటున్నది. కానీ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు వస్తున్నాయి. ఎస్జీటీల ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదు. స్పౌజ్, పరస్పర బదిలీల వల్ల కొన్ని ఎస్జీటీల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు 2,680 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలకు పదోన్నతులు లభిస్తాయి. దీంతో 2,680 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలతో ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులుంటే వారిద్దరూ పదోన్నతులు పొందితే ఆ బడి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. అయితే ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా విద్యార్థులకు న్యాయం చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
రేపటినుంచి ఉపాధ్యాయ పదోన్నతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES