చివరి లీగ్‌లో దక్షిణాఫ్రికా చిత్తు..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
ఇండోర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. దక్షిణాఫ్రికా జట్టు రెండోస్థానానికే పరిమితమైంది. నేడు చివరి లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్త్‌లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 29(బుధ) తొలి సెమీస్, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 30(గురు) రెండో సెమీస్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూడకుండా సెమీస్‌కు చేరడం విశేసం.
దక్షిణాఫ్రికాపై ఆసీస్ అలవోకగా
ప్రపంచ కప్‌లో అద్భుత విజయాలతో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు చివరి లీగ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తప్పలేదు. తొలి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 69 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా జట్టు.. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 97 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ను ఓడించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశలు అడియాశలయ్యాయి. ఇండోర్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో అలనా కింగ్(7/18) సంచలన బౌలింగ్‌తో ప్రతర్థిని కుప్పకూల్చింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 16.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను ముగించింది. బేత్ మూనీ(42) ఔటైనా.. సథర్‌లాండ్(10 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టాస్ గెలిచి సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆస్ట్రేలియా.. అలనా కింగ్ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 97 పరుగులకు కుప్పకూలింది.
స్పిన్నర్ అలనా కింగ్(7-18) తిప్పేయగా.. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31)ను ఔట్ చేసిన మేగన్ షట్ తొలి వికెట్ అందించగా.. ఫామ్‌లో ఉన్న తంజిమ్ బ్రిట్స్(6)ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. అక్కడి నుంచి అలనా కింగ్ సఫారీలను దెబ్బకొడుతూ వచ్చింది. తొలుత.. సునే లుస్(6)ను ఔట్ చేసిన తను.. అనెరీ డిర్కెసెన్(5), గత మ్య్చాలో హాఫ్ సెంచరీ బాదిన మరినే కాప్(0), సినాలో జఫ్తా(29), చ్లో ట్రయాన్(0), నడినే డీక్లెర్క్(14), మసబత క్లాస్(4)లను ఔట్ చేసి.. ఏడో వికెట్ సాధించింది. కింగ్ విజంభణతో 24 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలేనా కింగ్‌కు దక్కింది.
11 పరుగులకే రెండు వికెట్లు
ఛేదనలో ఆరంభంలోనే డేంజరస్ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(5)ను ఔట్ చేసి మరినే కాప్ బ్రేకిచ్చింది. ఆ తర్వాతి ఓవర్లోనే ఎలీసా పెర్రీ(0) డకౌట్ కాగా 11 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. అయితే. సఫారీల ఉత్సాహంపై నీళ్లు చల్లుతూ బేత్ మూనీ(42), జార్జియా వోల్(38 నాటౌట్) దూకుడుగా ఆడారు. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించి జట్టును గెలుపు వాకిట నిలిపారు. అర్ధ శతకానికి చేరువైన మూనీని డీక్లెర్క్ పెవిలియన్ పంపింది. ఆ తర్వాత వచ్చిన అనాబెల్ సథర్‌లాండ్(10 నాటౌట్) సైతం ధనాధన్ ఆడడంతో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
స్కోర్లు(సంక్షిప్తంగా..) :
దక్షిణాఫ్రికా మహిళలు : 97ఆలౌట్ (24 ఓవర్లలో) వోల్వడార్ట్ 31, జఫ్టా 29; అలానా కింగ్ (7/18)
ఆస్ట్రేలియా మహిళలు : 98/3(16.5ఓవర్లలో) మూనీ 42, గార్జియా వాల్(38నాటౌట్), మారిజానే కాప్ (1/11)



