జీపీఎస్ టెక్నాలజీ నుంచి చైనీస్ ‘బైడూ’కి మారిన ఇరాన్ అదే దారిలో పలు దేశాలు
అమెరికన్ ఇంటర్నెట్‌పై నిఘా అనుమానాలు
సంఘమిత్ర
ఇప్పటి వరకు అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్ జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. దానికి చైనా కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పి, అమెరికా పెత్తనానికి సవాలు విసిరింది. తాజాగా చైనా-అమెరికా మధ్య ‘టెక్‌వార్’ మొదలైంది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన జీపీఎస్ టెక్నాలజీపైనే చైనా మినహా ఇతర ప్రపంచదేశాలు ఆధారపడ్డాయి. ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత ఈ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చాయి. అమెరికాకు చెందిన జీపీఎస్ టెక్నాలజీ ఆయా దేశాల్లో నిఘాకు పాల్పడుతున్నదనే అనుమానాలు బలపడ్డాయి. ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు మరణించారు. దీనితో ఇరాన్‌కు అమెరికా జీపీఎస్ టెక్నాలజీ మీద అనుమానం పెరిగింది.
యుద్ధం మధ్యలోనే జీపీఎస్ వ్యవస్థను డిజెబుల్ చేసి, చైనాకు చెందిన ‘బైడూ శాటిలైట్ నావిగేషన్’కు అనుసంధామైంది. ఆ తర్వాతే యుద్ధంలో ఇరాన్ ప్రతిదాడులకు ఇజ్రాయిల్, అమెరికా బెంబేలెత్తాయి. చివరకు రాజీకి వస్తామంటూ ట్రంప్ ప్రకటించకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలెవ్వరూ అమెరికాకు చెందిన జీపీఎస్ టెక్నాలజీని వాడొద్దనీ, అది నిఘాకు పాల్పడుతున్నదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు చెందిన జీపీఎస్ నావిగేషన్ టెక్నాలజీ నెట్‌వర్క్ కంటే చైనాకు చెందిన బైడూ నావిగేషన్ టెక్నాలజీ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇప్పటికే చైనా, ఇరాన్ దేశాలు వ్యాపార, ఇంథన, రక్షణ సహా పలు విషయాల్లో భాగస్వాములుగా ఉన్నాయి. యుద్ధం తర్వాత ఇరాన్ క్రమంగా పాశ్చాత్య సంబంధాల నుంచి వైదొలుగుతున్నది.
అమెరికా ఆంక్షలతో అంతర్జాతీయ ఆర్ధిక లావాదేవీల వ్యవస్థ ‘స్విప్ట్’ నుంచి ఇరాన్ ఇప్పటికే వైదొలగింది. ఇప్పుడు అమెరికా జీపీఎస్ నావిగేషన్ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ నుంచి కూడా తప్పుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్ తమ దేశంలో 97 శాతం ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసింది. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్ యాప్‌లను ‘గూఢచర్య పరికరాలంటూ’ డిలీట్ చేయమని దేశంలోని తొమ్మిది కోట్ల మంది ప్రజల్ని కోరింది. అమెరికా జీపీఎస్ వ్యవస్థను ఇరాన్ భూభాగం నుంచి మొత్తానికే డిజెబుల్ చేసేసింది. దీనితో అమెరికా ఆటలు ఇరాన్‌లో సాగలేదు. పైపెచ్చు ప్రతిదాడుల్లో ఇజ్రాయిల్, అమెరికా దేశాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి.
విరమణ తాత్కాలికమే: ఇరాన్
ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ శాశ్వత శాంతి కోసం కాదని ఇరాన్ ఇప్పటికే పసిగట్టింది. ఇజ్రాయిల్ కోల్పోయిన బలాన్ని తిరిగి పుంజుకోవడం కోసం తాత్కాలిక ఉపశమనంగానే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనా సాంకేతికత సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. అమెరికా నుంచి ముప్పుఉన్న దేశాలన్నీ ఇప్పుడు క్రమంగా తమ దేశాల్లో కూడా జీపీఎస్ శాటిలైట్ నెట్‌వర్క్ నుంచి తప్పుకుంటున్నాయి. ఆ దేశాలన్నింటికీ ఇప్పుడు చైనా బైడూ శాటిలైట్ నావిగేషన్ నెట్‌వర్క్ ఆశాజనకంగా కనిపిస్తుంది. దీన్ని అమెరికా సహించలేకపోతుంది. చైనా టెక్నాలజీ ముందు తాము నిలబడలేమని తేలిపోవడంతో టెక్‌వార్‌కు సిద్ధమవుతోంది. స్పేస్‌ను కంట్రోల్ చేసే వాళ్లే యుద్ద క్షేత్రాన్ని కంట్రోలు చేయగరని యుద్దనిపుణులు చెప్తుంటారు. అమెరికా కంటే చైనా ఆపనిని మరింత సమర్థవంతంగా చేస్తుండటంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. భవిష్యత్‌లో అమెరికా ట్రేడ్‌వార్ కంటే ‘టెక్‌వార్’కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు చైనా, ఇరాన్ వంటి దేశాలకు ఉన్నాయి. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యూహాలూ సిద్ధమవుతున్నాయి.