Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు

ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  పాత కలెక్టరేట్ మైదానంలో జులై 25 వ తేదీ నుండి ఆగస్టు మూడో తేదీ వరకు నిర్వహించిన తీజ్ ఉత్సవాలు విజయవంతంగా ముగిసాయని తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా గోర్ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తీజ్  ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, యువకులు, అందరూ కలిసి గిరిజనులు సాంప్రదాయ వేషాధారణలో ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు.లంబాడ గిరిజనుల కుల దేవతకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు, యువతులు సాంప్రదాయ నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…బంజార సభ్యులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు తమ తీజ్ పండుగ ప్రాముఖ్యతను తెలపడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పండుగ ముఖ్య ఉద్దేశ్యం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తీజ్ పండుగ వేడుకల్లో సాంప్రదాయ గిరిజన దుస్తులతో మహిళలతో కలిసి ఆడిపాడారు.

తీజ్ పండుగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకొని గిరిజన మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి వినాయక్ నగర్  గల రుక్మిణి ఛాంబర్ వద్ద గల సేవాలాల్ మహారాజ్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, రైల్వే అసోసియేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు బంజారా నాయకులు తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -