నవతెలంగాణ-హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో క్యూ న్యూస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆఫీస్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌లు.. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
అయితే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.