Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగాలకు చిరునామా తెలంగాణ

ఉద్యోగాలకు చిరునామా తెలంగాణ

- Advertisement -

రెండేండ్లలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
తుది దశలో మరో 8632 నియామకాలు
లక్ష ఉద్యోగాల మైలురాయి దిశగా ప్రయాణం
యువతకు ఉద్యోగం.. తెలంగాణ భావోద్వేగం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండేండ్లలో తెలంగాణ యువత జీవితం మలుపు తిరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏండ్లుగా నియామకాలకు నోచుకోక తల్లడిల్లిన తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొలువుల పండుగను నిర్వహించి నిరుద్యోగులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందించి సరికొత్త ఒరవడిని నెలకొల్పారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన యువతీ, యువకుల సందడి, వారి కుటుంబాల ఆనందంతో రాష్ట్రంలోని అన్ని పల్లెలు. పట్టణాల్లో కొలువుల పండుగ స్ఫూర్తి వెల్లివిరిసింది.

ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ఈ రెండేండ్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసింది. మరో 8,632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయి. వీటితో కలిపితే మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011. త్వరలోనే లక్ష ఉద్యోగాల మైలురాయిని అందుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగాల భర్తీలోనూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో పాలనా విభాగంలో అత్యున్నతమైన సర్వీసులతో పాటు విద్యా, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించే చర్యలు వేగవంతం చేశారు. పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాల వయో పరిమితిని ప్రజా ప్రభుత్వం సడలించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో, నియామక పత్రాలు ఎప్పుడిస్తారో అనే స్పష్టత ఉండేది కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలి రెండేండ్లలోనే కీలకమైన పరీక్షలను విజయవంతంగా నిర్వహించి చెప్పిన సమయానికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది.

రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో ప్రతిభను చాటి ఉద్యోగాలకు ఎంపికైన యువతను అభినందించేందుకు, వారికి నియామక పత్రాలు అందించేందుకు సీఎం ప్రత్యేక చొరవ చూపారు. రెండేండ్లలో 13 సార్లు కొలువుల పండగ వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించిన యువతను ఆహ్వానించి ఎల్‌బీ స్టేడియం, శిల్ప కళా వేదికలో భారీ వేడుకగా కొలువుల పండగ జరిపారు. స్వయంగా సీఎం హాజరై నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెప్పారు. ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు, వారి తల్లిదండ్రులతో కలిసి నియామక పత్రాలను అందుకోవటం నవతరానికి కొత్త స్పూర్తిని అందించింది. తెలంగాణలో వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి ఆ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

సివిల్‌ సర్వీసెస్‌ తరహాలో తెలంగాణలో అత్యున్నతమైన సర్వీసు ఉద్యోగాలకు నిర్వహించే తొలి గ్రూప్‌ 1 రిక్రూట్‌మెంట్‌ను ప్రజా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. గతంలో పేపర్‌ లీకేజీతో ఆందోళనకు గురై యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గందరగోళమైన గ్రూప్‌ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 562 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచి గ్రూప్‌ 1 సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌ 2 పరీక్షలను కూడా ప్రభుత్వం ప్రశాంతంగా నిర్వహించింది. 2024 డిసెంబర్‌ 15 ,16 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. తుది ఫలితాలు 2025 సెప్టెంబర్‌ 28న విడుదల చేసి ఉద్యోగాలకు ఎంపికైన 782 మంది అభ్యర్థులకు అక్టోబర్‌ 18న ప్రభుత్వం నియామక పత్రాలు అందించారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 సర్వీస్‌ పోస్టుల కోసం మూడేండ్ల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రజా ప్రభుత్వ హయాంలో గాడిలో పడింది. 1,365 పోస్టులతో 2022 డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదలైతే గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వీరికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన గ్రూప్‌ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం వేదికపై మొత్తం 8,143 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ రెండేండ్లలోనే 15,780 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 నియామకాలకు అదనంగా ఇతర విభాగాల్లో 6,293 పోస్టులను భర్తీ చేసింది.

గత పదేండ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 పోస్టులను భర్తీ చేసింది. గత జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్‌ 30న ఫలితాలను వెల్లడించింది. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. రెసిడెన్షియల్‌ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులన్నీ కలిపి 8,400 మందికి నియామక పత్రాలను అందించింది. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతులకు తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ను బోర్డు ద్వారా కానిస్టేబుల్‌ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16,067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు 8,666 మంది ఉద్యోగ నియామకాలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో 6,956 స్టాఫ్‌ నర్సులతో పాటు 1,260 ల్యాబ్‌ టెక్నిషియన్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 422, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫిజియో థెరపిస్ట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులున్నాయి. వీటితో పాటు మరో 7,267 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ నియామకాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -