నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల కమలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి ఎంతో మంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండికట్టి అని అద్భుతమైన కవితలు రాశారు. ఆ పెద్దల స్ఫూర్తితో, మరి భవిష్యత్‌లో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామ్య వాతావరణం రావాలని ఆశయంతో కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.